ముకేశ్‌ అంబానీకి అత్యున్నత జడ్+ భద్రత

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ  భద్రతపై సుప్రీంకోర్టు  కీలక ఆదేశాలు జారీ చేసింది. ముకేశ్‌ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అత్యున్నత జడ్ + భద్రత కల్పించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
 
 అయితే.. ముకేశ్‌ అంబానీకి భారతదేశం లేదా విదేశాల్లో అత్యున్నత స్థాయి జడ్ + సెక్యూరిటీని అందించడానికి అయ్యే మొత్తం ఖర్చులు అంబానీనే భరించాలని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు కృష్ణ మురారి, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
 
ముంబైలో అంబానీకి, ఆయన కుటుంబ సభ్యులకు కేంద్రం సెక్యూరిటీని కొనసాగించాలంటూ గత ఏడాది జులై 22 న సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని… దీనిపై స్పష్టత కావాలని కోరుతూ త్రిపురకు చెందిన బికాస్ సాహా అనే వ్యక్తివేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఆ పిటిషన్ లో అంబానీ కుటుంబం భద్రత మహారాష్ట్రకు మాత్రమే పరిమితమా? దేశ విదేశాల్లోనూ అమలు చేస్తారా? అన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
 
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం.. ముకేశ్‌ అంబానీ భారత్ లో ఉన్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత కల్పిస్తుందని పేర్కొంది. ఇక విదేశాలకు వెళ్లినప్పుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రతా ఏర్పాట్లను కల్పించాలని సూచించింది.
 
ఒక వ్యక్తి భద్రతకు ముప్పు పొంచి ఉన్నప్పుడు.. ఆయనకు కల్పించే భద్రతను ప్రాంతానికి లేదా నగరానికి పరిమితం చేయకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. అంబానీ కుటుంబానికి మహారాష్ట్రతో సహా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల్లోనూ  వ్యాపారాలు ఉన్నాయని.. అందువల్ల దేశ విదేశాల్లో ఏకరీతి, అత్యున్నత స్థాయి భద్రత అవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
 
ముకేశ్ అంబానీ కుటుంబం తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ముంబై పోలీసులు, కేంద్ర హోం వ్యవహారాల శాఖ, కేంద్ర ప్రభుత్వం.. అంబానీలకు పొంచి ఉన్న ముప్పు గురించి మదింపు చేశాయని… వారికి ముప్పు ఉన్నట్లు నిర్ధారించినందువల్లే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించారని పేర్కొన్నారు.
 
అంబానీలకు దేశవ్యాప్తంగా, విదేశాల్లో వ్యాపార సంస్థలు ఉన్నాయని, దాతృత్వ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తారని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచడం కోసం వీరిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల వారికి మన దేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా రక్షణ కల్పించాలని కోరారు.
బికాస్ సాహా వేసిన పిల్‌పై త్రిపుర హైకోర్టు మే 31 న, జూన్ 21 న రెండు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అంబానీ కుటుంబ సభ్యులకు పొంచి ఉన్న ముప్పు వివరాలను కోర్టుకు సమర్పించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. త్రికోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన అప్పీల్‌పై విచారించిన సుప్రీంకోర్టు.. వారికి భద్రతను కొనసాగించాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది.