అయిదు రోజుల సిబిఐ క‌స్ట‌డీలో మ‌నీష్ సిసోడియా

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఐదు రోజుల రిమాండ్ విధించింది సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం. ఫలితంగా.. మార్చ్ 4వ తేదీ వరకు మనీశ్ సిసోడియా సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు. సిసోడియాను సీబీఐ అధికారులు సోమవారం కోర్టులో హాజరుపరచగా విచార‌ణ కోసం అయిదు రోజులు త‌మ క‌స్ట‌డీకి ఇవ్వ‌వ‌ల‌సిందిగా సిబిఐ కోర్టును అభ్య‌ర్ధించింది.
 
దీనిపై న్యాయస్థానంలో సిసోడియా తరఫు న్యాయవాది దయన్ కృష్ణన్ వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేసిందని తెలిపారు. సీబీఐ పలుమార్లు చేసిన సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదని వివరించారు. న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా సిసోడియా అరెస్ట్ జరిగిందని పేర్కొంటూ సిసోడియాను కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు.
 
ఇదే కేసులో విజయ్ నాయర్ ఇప్పటికే బెయిల్ పొందారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిసోడియాకు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాలను సీబీఐకి అప్పగించడం జరిగిందని కోర్టు దృష్టికి తెచ్చారు.
 
అయితే, తమ ప్రశ్నలకు మనీశ్ సిసోడియా తప్పించుకునే విధంగా సమాధానాలిచ్చినట్టు కోర్టుకు తెలిపింది సీబీఐ. లిక్కర్ పాలసీ తొలి డ్రాఫ్ట్లో లేని ఆరు వివాదాస్పద నిబంధనలను వివరించడంలో ఆయన విఫలమైయ్యారని పేర్కొంది. లిక్కర్ లాబీ కోరికల మేరకు సవరణలు చేయడంతో కనీసం రూ. 100 కోట్లు విలువ చేసే నిధులు అక్రమంగా చేతులు మారినట్లు ఆరోపించింది.
 
సిసోడియా ఒకేసారి పలు మొబైల్‌ ఫోన్లు, సిమ్‌కార్డులను మార్చి.
 నిందితులతో మాట్లాడిన సాక్షాలను మాయం చేశారని సీబీఐ తరఫు న్యాయవాది విచారించారు. మద్యం పాలసీలో చివరి నిమిషంలో మార్పులతో లైసెన్స్లు పొందిన వారికి లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. లిక్కర్ పాలసీలో కమిషన్‌ను 5 నుంచి ఏకంగా 12 శాతానికి పెంచారని ఆరోపించారు. కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను సైతం జడ్జి ముందుంచారు
 
ఇరుపక్షాల వాదనలను విన్న స్పెషల్ జడ్జీ ఎంకే నాగ్పాల్ మనీశ్ సిసోడియానుమార్చి ఐదు రోజుల 4 వరకు సీబీఐ కస్టడీకి అనుమతించింది.