74 రకాల మందుల రిటైల్ ధరలను ఖరారు చేసిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైజింగ్ అథారిటీ  తాజాగా 74 రకాల మెడిసిన్స్ రిటైల్ ధరలను ఖరారు చేసింది. ఇందులో  షుగర్, రక్తపోటు  మందులు కూడా ఉన్నాయి. డ్రగ్స్ (ధరల నియంత్రణ) చట్టం ఆధారంగా ఈనెల 21వ తేదీన జరిగిన 109వ సమావేశంలో ఈ మందుల ధరలను  ఎన్‍పీపీఏ నిర్ధారించింది. కొన్ని మందుల రేట్లను తగ్గించింది.

నోటిఫికేషన్ ప్రకారం, డపాగ్లిఫ్లోజిన్ సిటాగ్లిప్టిన్, మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ఫార్ములేటెడ్ ఒక్కో ట్యాబ్లెట్ ధరను రూ.27.75గా ఎన్‍పీపీఏ నిర్ధారించింది. బ్లడ్ ప్రెజర్ నియంత్రణకు వినియోగించే టెల్మిసర్టన్, బిసోప్రోలోల్ ఫ్యుమరేట్ ఒక్కో ట్యాబ్లెట్ ధరను రూ.10.92కు నిర్ణయించింది.

సోడియం వాల్ప్రోయేట్ 20 ఎంజీ ఒక్కో ట్యాబ్లెట్ ధరను రూ.3.20కు తగ్గించింది.  ఫిల్‍గ్రాస్టిమ్ ఇంజెక్షన్ ఒక్కో వైరల్ ధరను రూ.1,034.51గా ఫిక్స్ చేసింది. హైడ్రోకొర్టిసోన్ స్టెరాయిడ్ ఒక్కో ట్యాబ్లెట్ రేటును రూ.13.28కు చేంజ్ చేసింది. మరిన్ని మెడిసిన్ ధరల్లోనూ మార్పులు చేసింది.

అలాగే, మరో 80 మందుల గరిష్ఠ ధరను కూడా ఎన్‍పీపీఏ సవరించింది. మార్పు చేసిన రిటైల్ ధరలు త్వరలో అందుబాటులోకి వస్తాయి. దేశంలో నియంత్రిత డ్రగ్స్, ఫార్ములేషన్ల ధరలను నిర్ణయించడం/సవరించడం, ధరలు అమలయ్యేలా చేయడం, మెడిసిన్ లభించేలా చర్యలు తీసుకోవడం ఎన్‍పీఏఏ ప్రధాన విధులుగా ఉన్నాయి. మందుల ధరలు నియంత్రణలో ఉండేలా ఎన్‍పీఏఏ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది.