సిసోడియా అరెస్టును రాజకీయం చేస్తున్న ఆప్

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టును ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయం చేస్తోందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం గురించి ప్రజలందరికీ తెలుసని పేర్కొంటూ 2 శాతం ఉన్న డీలర్ కమిషన్‌ను 12 శాతం ఎందుకు పెంచారో చెప్పాలని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సీఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. ఈ పెంచిన కమిషన్ ద్వారా పోగేసిన సొమ్ము దొడ్డిదారిన తిరిగి పార్టీకి చేరిందని ఆయన ఆరోపించారు.

ఢిల్లీ జనాన్ని మత్తులో ముంచి సంపాదించిన అవినీతి సొమ్ముతో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి రాకముందు గల్లీ పార్లమెంట్ నిర్వహించి మహిళల అభిప్రాయాలు తీసుకున్నారని, గల్లీల్లో ఉన్న మద్యం దుకాణాలను మూసేయాలని మహిళలు కోరగా, అధికారంలోకి వస్తే వాటిని మూసేస్తానని చెప్పారని ఆయన గుర్తు చేశారు.

కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేత కాదు కదా, గల్లీ గల్లీకి మద్యం దుకాణాలు తెరిచారని బీజేపీ నేత మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఒక బ్యూరోక్రాట్ అని, ఎక్సైజ్ పాలసీ మీద ఆయన  లేదా, ఆ పార్టీ నేతలు ఎవరైనా మీడియా సమావేశం పెట్టారా? అని ఆయన ప్రశ్నించారు. ఆ పాలసీ ద్వారా ప్రభుత్వానికి ఎంత ప్రయోజనం కల్గిందో చెప్పగలరా అని నిలదీశారు.

ఇందులో జరిగిన అవకతవకలను లెఫ్టినెంట్ గవర్నర్ లేవనెత్తగానే డీలర్ కమిషన్‌ను 12 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారని, ఆ తర్వాత కొన్నాళ్లకే మద్యం పాలసీని రద్దు చేశారని సంబిత్ పాత్ర గుర్తుచేశారు. పాలసీలో ఎలాంటి తప్పు లేకపోతే ఈ నిర్ణయాలు ఎందుకు వెనక్కి తీసుకున్నారని బిజెపి నేత  ప్రశ్నించారు.

పాలసీ రూపొందించే సమయంలోనే ఆప్ నేతలు లిక్కర్ సిండికేట్ వ్యాపారులతో మంతనాలు సాగించారని, వారికి అనుకూలంగా నిబంధనలు రూపొందించారని, సిండికేట్‌కు ఇబ్బందిగా ఉండే నిబంధనలను తొలగించారని ఆయన ఆరోపించారు. చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ మద్యం తయారీదారుడు, హోల్‌సేలర్, రిటైలర్ ఒక్కరే ఉన్నా సరే టెండర్లు కట్టబెట్టారని విమర్శించారు.

అలాగే బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలకు కూడా లైసెన్సులు మంజూరు చేశారని పేర్కొన్నారు. ఇంత స్పష్టంగా అక్రమాలు కళ్లకు కనిపిస్తున్నాయని, ఆప్ నేతలకు మాత్రం కనిపించడం లేదని బీజేపీ నేత ఎద్దేవా చేశారు. దర్యాప్తు సంస్థలు భావోద్వేగాల ఆధారంగా పనిచేయవని, సాంకేతిక అంశాలు, ఆధారాల అనుగుణంగానే దర్యాప్తు జరుపుతాయని ఆయన స్పష్టం చేశారు. లేదంటే న్యాయస్థానాల్లో అవి నిలబడవని చెప్పారు.

దర్యాప్తు సంస్థలకు ఉద్దేశాలను ఆపాదిస్తూ రాజకీయాలు చేయడం తగదని హితవు చెప్పారు. ఒక విద్యాశాఖ మంత్రి మద్యం కుంభకోణంలో అరెస్టు కావడాన్ని మించిన సిగ్గుచేటు మరొకటి ఉండదని సంబిత్ పాత్ర మండిపడ్డారు. దేశంలో మరెక్కడా ఇలాంటి ఘటన జరిగలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ మహిళలు కోరింది ఒకటైతే, కేజ్రీవాల్ మరొకటి చేశారని, అందుకే ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఊచలు లెక్కించాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు.

దర్యాప్తు సంస్థలు, రాజకీయ పార్టీలు వేర్వేరు అంశాలని, రెండింటినీ ముడిపెట్టడం తగదని బిజెపి నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ విషయంలో కూడా ఆప్ నేతలు ఇలాగే ఆరోపణలు చేశారని, కానీ కోర్టు ఇప్పటి వరకు బెయిలే ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. కేసులో మెరిట్ ప్రకారమే బెయిల్ ఇవ్వడం లేదని న్యాయస్థానాలు చెబుతున్నాయని, మనీశ్ సిసోడియా విషయంలోనూ ఇదే జరగుతుందని పాత్ర స్పష్టం చేశారు. బీజేపీపై ఆరోపణలు చేసే కేజ్రీవాల్, ముందు మద్యం పాలసీకి సంబంధించి బీజేపీ లేవనెత్తిన 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.