అవినీతిని ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా మార్చినా ప్రయోజనం ఉండదు

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆదివారం ఉదయం సీబీఐ కార్యాలయానికి విచారణకు వెళ్ళడానికి ముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద ప్రార్థనలు చేసి, రోడ్ షో నిర్వహించడాన్ని బిజెపి ఎద్దేవా చేసింది. వినీతిని ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా మార్చినంత మాత్రానికి దానిని దాచిపెట్టడం సాధ్యం కాదని బీజేపీ స్పష్టం చేసింది.
 
ఢిల్లీ మద్యం విధానం కేసులో ప్రశ్నలకు ఆమ్ ఆద్మీ పార్టీ సమాధానాలను చెప్పలేదని ఆరోపించింది. సత్యాన్ని దాచిపెట్టడంలో వారు తీరిక లేకుండా గడుపుతున్నారనే విషయం సుస్పష్టమని తెలిపింది.
 
సిసోడియా ఇచ్చిన ట్వీట్‌లో, ఆదివారం ఉదయం తాను సీబీఐ విచారణకు మరోసారి హాజరవుతానని తెలిపారు. ఈ దర్యాప్తులో తాను సంపూర్ణంగా సహకరిస్తానని తెలిపారు. లక్షలాది మంది బాలల ప్రేమాభిమానాలు, కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదాలు తనకు ఉన్నాయన్నారు. కొద్ది నెలలపాటు జైలులో ఉండవలసి వస్తే తాను పట్టించుకోనన్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా  మీడియాతో మాట్లాడుతూ, అవినీతిని ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా మార్చడం వల్ల ప్రయోజనం ఉండదని హితవు చెప్పారు. దానివల్ల ఆ అవినీతిని దాచిపెట్టడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆ పార్టీవారు సీబీఐ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని అంటూ వారు సత్యాన్ని దాచిపెట్టడంలో తీరిక లేకుండా గడుపుతున్నారని విమర్శించారు.

 సీబీఐ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, ఈవెంట్ మేనేజ్‌మెంట్ అవసరం లేదని దుయ్యబట్టారు.  ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు జరిగినట్లు నమోదైన సీబీఐ కేసులో మనీశ్ సిసోడియా నిందితుడు. ఈ కుంభకోణం జరిగిన సమయంలో ఎక్సయిజ్ మంత్రిగా ఆయన వ్యవహరించారు. ముడుపులు తీసుకుని ఎక్సయిజ్ సుంకాలను తగ్గించడం, అక్రమంగా లైసెన్సులు మంజూరు చేయడం వంటి అక్రమాలకు ఆయన పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో దర్యాప్తు జరపాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గత ఏడాది ఆదేశించిన సంగతి తెలిసిందే.