బెంగాల్ లో మంత్రి నిశిత్ ప్ర‌మాణిక్ కాన్వాయ్ పై దాడి

పశ్చిమబెంగాల్‭లోని కూచ్ బెహార్ పర్యటనకు వెళ్లిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. దీంతో ఆయన ప్రయాణించిన కారు ముందున్న అద్దం ధ్వంసమైంది. స్పందించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగించారు. పశ్చిమ బెంగాల్‌లోని మంత్రి సొంత నియోజకవర్గం కూచ్‌బెహార్‌లో ఈ సంఘటన జరిగింది.

ఇదే సమయంలో ప్రత్యర్థులపైకి ఎదురు దాడికి  బీజేపీ కార్యకర్తలు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కేంద్రమంత్రి నిశిత్ ప్రమాణిక్ పర్యటనను అడ్డుకున్న తృణమూల్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. కారు అద్దాలు పగులగొట్టి మంత్రికి నల్లజెండాలతో నిరసన తెలిపారు.  పోలీసులు తృణమూల్ కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేసినా వారు తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు.

ఇటీవల బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కాల్పుల్లో స్థానిక గిరిజనుడు చనిపోయాడు. దానితో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ ఇటీవల ఇక్కడ ర్యాలీ నిర్వహించి గిరిజనుడి హత్యపై కేంద్ర మంత్రి నిసిత్‌ ఏమీ చేయడం లేదని మండిపడ్డారు. ఆయనకు వ్యతికేకంగా నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. శనివారం స్థానిక బీజేపీ కార్యాలయానికి వెళ్తుండగా కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై ఈ దాడి జరిగింది.

మరోవైపు బెంగాల్‌లో అధికారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి నిసిత్‌ ప్రమాణిక్‌ మండిపడ్డారు. మంత్రికే రక్షణ లేకపోతే సాధారణ ప్రజల భద్రత గురించి ఊహించుకోవచ్చని విమర్శించారు. తన కాన్వాయ్‌పై జరిగిన దాడి సంఘటన బెంగాల్‌లో ప్రజాస్వామ్య పరిస్థితికి నిదర్శనమని ఆరోపించారు.

ఈ దాడిని తృణ‌ముల్ కాంగ్రెస్ కార్యకర్తలే చేశారని స్పష్టం చేశారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, హింసకు పాల్పడిన వారికి రక్షణ కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు.  కేంద్ర మంత్రి కారుపై ఈ విధంగా దాడి జరిగితే, రాష్ట్రంలోని సామాన్య ప్రజల భద్రత గురించి  ఆలోచించాలని బీజేపీ పశ్చిమ బెంగాల్ అధికార ప్రతినిధి షమిక్ భట్టాచార్య ధ్వజమెత్తారు.  రాష్ట్రంలో ఆర్టికల్ 355 విధించేందుకు గవర్నర్ చర్యలు ప్రారంభించాలని భట్టాచార్య డిమాండ్ చేశారు.

ఈ ప్రాంతంలో ఎప్పుడు పర్యటనకు వచ్చినా తాము అడ్డుకుంటామని టిఎంసి వర్గాలు మంత్రికి తెలిపాయి. ఈ ప్రాంతంలో ఆయన ఎక్కడికి వెళ్లినా జనం నుంచి నల్లజెండాలే కన్పిస్తాయని టిఎంసి స్థానిక నేత ఉదయన్ గుహా రెండు మూడు రోజుల క్రితమే తెలిపారు. ఇప్పుడు ఈ ప్రాంత పర్యటనకు వచ్చిన మంత్రికి ఇప్పుడు ఈ అనుభవం ఎదురైంది.