2023 విజయ సంవత్సరం .. జెలెన్‌స్కీ ధీమా

వారాలు.. నెలలు అనుకున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఏడాదికి చేరింది. సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించి ఏడాది పూర్తైంది. రష్యా ఆక్రమణతో మొదలైన ఈ యుద్ధం ఉక్రెయిన్‌ వీరోచిత ప్రతిఘటనతో ఇంతకాలంగా కొనసాగుతూ వస్తోంది. ఈ వార్‌లో ఇరు దేశాల నుంచి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
 
కాగా, యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తైన సందర్భంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ  తన దేశ ప్రజలకు ఓ సందేశం ఇచ్చారు. ‘2023 విజయ సంవత్సరం అవుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.  ‘ఫిబ్రవరి 24న మనలోని లక్షలాది మంది ఒక దారిని ఎంచుకున్నారు. తెల్ల జెండాని కాదు.. నీలం, పసుపు రంగు జెండాని ఎంపిక చేసుకున్నాం. పారిపోలేదు.. ఎదుర్కొంటున్నాము, ప్రతిఘటిస్తున్నాం, పోరాడుతున్నాం’ అంటూ స్పష్టం చేశారు.
 
ఇది బాధ, దుఃఖం, విశ్వాసం, ఐక్యతా సంవత్సరం, మనం అజేయంగా ఉన్న సంవత్సరం అని పేర్కొన్నారు. 2023 మన విజయ సంవత్సరమని మనకు తెలుసని ఆయన భరోసా వ్యక్తం చేస్తూ ఓ వీడియోను తన పోస్టుకు జత చేశారు. ఇదే సందర్భంలో ఏడాది కిందట ఉక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని జెలెన్‌స్కీ గుర్తు చేసుకున్నారు.
 
 ‘సంవత్సరం క్రితం ఇదే రోజున, ఇదే స్థలం నుంచి ఉదయం ఏడు గంటలకు ప్రసంగించాను. అది కూడా కేవలం 67 సెకన్లు మాత్రమే’ అని తెలిపారు. ‘మనం  బలంగా ఉన్నాము. దేనికైనా సిద్ధంగా ఉన్నాము. మనం అందరినీ ఓడిస్తాము. ఫిబ్రవరి 24, 2022న ఇలా ప్రారంభమైంది. మన జీవితంలో సుదీర్ఘమైన రోజు. అత్యంత కష్టమైన రోజు. ది ఇయర్ ఆఫ్ ఇన్విజబిలిటీ’ అని చెప్పుకొచ్చారు.
 
ఇలా ఉండగా, రష్యాతో యుద్ధం వల్ల తీవ్ర కష్టాల్లో ఉన్న ఉక్రెయిన్‌కు ఆర్థికసాయం అందించేందుకు అమెరికా మరోసారి ముందుకొచ్చింది. రూ.16,500 కోట్ల ఆయుధ సహాయ ప్యాకేజీని అమెరికా సిద్ధం చేస్తున్నట్టు పలు సంస్థలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌పై దాడికి ఏడాది పూర్తయిన సందర్భంగా మరో సైనిక దాడికి రష్యా ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో అమెరికా ఆర్థిక సాయం సిద్ధం అవుతున్నదని తెలిపాయి.