హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అవార్డుల్ లోఆర్ఆర్ఆర్ కు 5 అవార్డులు

అంతర్జాతీయ వేదికలపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ‘ఆస్కార్‌’కి అడుగు దూరంలో ఉన్న ఈ చిత్రానికి అమెరికాలో జరిగిన హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డుల్లో హాలీవుడ్‌ చిత్రాలను సైతం వెనక్కి నెట్టేసి ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది.  బెస్ట్‌ స్టంట్స్‌, బెస్ట్‌ యాక్షన్‌ మూవీ, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ (నాటు నాటు), బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌, హెచ్సీఏ స్పాట్‌ లైట్‌ (విదేశాల్లో సైతం విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం) అవార్డులను సొంతం చేసుకుని మన తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకూ చాటింది.
 
‘‘భారత దేశం ఎన్నో కథలకు పుట్టినిల్లు. ఏ సినిమా కథ అయినా మాకున్న పురాణ, ఇతిహాసాల నుంచే పుట్టాలి. నా కథలకు స్ఫూర్తి మా పురాణాలే. మేరా భారత్‌ మహాన్‌’’ అని అంతర్జాతీయ వేదికపై దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి గొంతెత్తి చెప్పారు.
 
”మా మూవీలో స్టంట్స్‌ గుర్తించి అవార్డు ఇచ్చిన ‘హెచ్‌.సి.ఎ కు ధన్యవాదాలు.  ముందుగా మా యాక్షన్‌ కొరియోగ్రాఫర్లకు ధన్యవాదాలు. మా సినిమా కోసం భారత్‌కు వచ్చి.. మా విజన్‌ అర్ధం చేసుకుని మాకు అనుగుణంగా మారి కష్టపడి పనిచేసిన ఇతర స్టంట్‌ మాస్టర్స్‌ అందరికీ కృతజ్ఞతలు.. ” తెలిపారు. సినిమాలోని రెండు, మూడు షార్ట్స్‌ లో మాత్రమే డూప్స్‌ ను ఉపయోగించామని చెబుతూ మిగతావన్ని ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ స్వయంగా చేశారని, ఈక్రెడిట్‌ అంతా తమ బృందానికి అని చెప్పారు.
 
రాజమౌళి, రామ్‌చరణ్‌ తదితరులు ఈ వేడుకలో భాగమయ్యారు. ‘బెస్ట్‌ యాక్షన్‌ ఫిల్మ్‌’ కేటగీరీలో ఏరియల్‌ కంబాట్‌ ఫిల్మ్‌ ‘టాప్‌ గన్‌: మేవరిక్‌’, ‘బ్లాక్‌ పాంథర్‌’, ‘బ్యాట్‌ మ్యాన్‌’, ‘విమెన్‌ కింగ్‌’ ఉన్నప్పటికీ ఆ సినిమాలను పక్కకు నెట్టి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ‘బెస్ట్‌ యాక్షన్‌ ఫిల్మ్‌’ అవార్డు సొంతం చేసుకుంది.