ఇతర దేశాల్లో డిజిటల్ చెల్లింపులకు యూపీఐ ఒక నమూనా

ఇతర దేశాల్లో డిజిటల్ చెల్లింపులకు యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) ఒక నమూనాగా నిలుస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. భారత్‌లో డిజిటల్ పేమెంట్స్ గతి చక్రాన్ని యూపీఐ మలుపు తిప్పిందని కొనియాడారు. ప్రపంచ దేశాలకు ఈ యూపీఐ ప్లాట్‌ఫారం ఒక టెంప్లేట్‌గా ఉపయోగపడుతుందని సూచించారు.
 
 జీ 20 సదస్సుకు భారత్ ఆతిథ్యంలో భాగంగా బెంగళూరులో ప్రారంభమైన ఆర్ధిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల తొలి సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగిస్తూ  డిజిటల్ పేమెంట్స్‌పై ఉన్న అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి భారత్ సిద్ధమంటూ మోదీ తెలిపారు.  ప్రస్తుతం భారత్‌లో డిజిటల్ చెల్లింపులకు విస్తృతంగా వినియోగిస్తున్న యూపీఐని ఇతర దేశాలు కూడా అనుసరించే ప్రయత్నాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జీ 20 దేశాల అతిథులకు యూపీఐ సేవలను వినియోగించే సౌలభ్యం కల్పిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.

“మీ కోసం కొత్త వ్యవస్థని రూపొందించాం. యూపీఐ సేవలను వినియోగించే సౌలభ్యాన్ని మీకు కల్పిస్తున్నాం. ఇక, డిజిటల్ పేమెంట్స్‌ని సులువుగా పూర్తి చేయగలరు. తద్వారా భారత్‌లో యూపీఐని ఎందుకింత అధికంగా వినియోగిస్తున్నారనే విషయం మీకు తెలుస్తుంది. డిజిటల్ చెల్లింపులకు యూపీఐ లాంటివి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయి” అని ప్రధాని పేర్కొన్నారు.

అత్యంత భద్రత, నమ్మకం, ప్రభావవంతంగా దేశీయ డిజిటల్ పేమెంట్స్ సిస్టం పనిచేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. తద్వారా సులువుగా లావాదేవీలు చేసుకునేందుకు దోహదపడిందని తెలిపారు. అదే సమయంలో టెక్నాలజీ దుర్వినియోగాన్ని క్రమబద్ధీకరించేందుకు తగిన ప్రమాణాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధాని స్పష్టం చేశారు.

కరోనా సమయంలో నగదు రహిత చెల్లింపులు చేయడానికి డిజిటల్ పేమెంట్స్ ఉపయోగపడ్డాయని ప్రధాని గుర్తు చేశారు. అయితే డిజిటల్ ఫైనాన్స్‌లో ఇటీవల పుట్టుకొచ్చిన కొన్ని ఆవిష్కరణల వల్ల టెక్నాలజీ దుర్వినియోగం అయ్యే ముప్పు ఉందని ప్రధాని హెచ్చరించారు. మంచి పనులు చేయడానికి టెక్నాలజీని ఎలా ఉపయోగించాలో మీకు తెలుసని జీ 20 అతిథులను ఉద్దేశించి ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం తీసుకు రావడానికి కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆర్ధిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు, సదస్సుకు హాజరైన ప్రతినిధులు సహకరించాలని ప్రధాని కోరారు. వందేళ్లకు ఓ సారి వచ్చే కరోనా లాంటి విపత్తు వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని విచారం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ ప్రభావం అధికంగా పడిందని గుర్తు చేశారు. జియో-పొలిటికల్ ఉద్రిక్తతల వల్ల పంపిణీ వ్యవస్థ(సప్లై చైన్)కి అంతరాయం కలిగిందని వెల్లడించారు. ఫలితంగా చాలా చోట్ల ధరలు పెరగడం, ఆహార కొరత ఏర్పడటం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని తెలపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిన పెట్టడానికి జీ 20 దేశాల ప్రతినిధులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.