నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పరిశ్రమలు నెలకొల్పాలి

విద్యార్థులు వినూత్న ఆలోచనలతో నూతన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసి పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు రావాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విద్యార్థులకు పిలుపు ఇచ్చారు. స్వావలంబన సాధించి భారత దేశాన్ని మరింత శక్తివంత దేశంగా అభివృద్ధి చేయడానికి కేంద్రం చేస్తున్న కృషికి పరిశోధనా సంస్థలు అంకుర సంస్థలు సహకరిస్తాయని  చెప్పారు.

పశ్చిమ బెంగాల్ విశ్వ భారతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో  మాట్లాడుతూ గురుదేవులు రవీంద్రనాధ్ ఠాగూర్ ని స్ఫూర్తిగా తీసుకుని స్పష్టమైన దృక్పధంతో జీవితంలో ఎదగడానికి విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. జీవిత లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తూ శతాబ్దాల నాటి భారతీయ సంప్రదాయాలు విలువలు పరిరక్షణకు  దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. 

శక్తి సామర్ధ్యాలను పూర్తిగా వినియోగిస్తూ ఒక బృందంలో పని చేసి విజయం సాధించడానికి కృషి చేస్తూ విజయాలు చూసి గర్వపడకుండా, అపజయం ఎదురైనప్పుడు కుంగిపోకుండా ముందుకు సాగాలని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. విచ్చలవిడితనం అపజయాలకు, సమతూల్యత విజయానికి కారణం అవుతాయని పేర్కొన్నారు.   విద్యార్థులు అహంకారానికి దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.

 “వ్యక్తిత్వం,జ్ఞానం, సంపదకు సమానమైన ప్రాధాన్యత  ఇవ్వాలి. భారతదేశ ప్రగతి పథంలో  యువత పాత్ర కీలకంగా ఉంటుంది.  మీరు ఎంత బలవంతులు అయితే  మన దేశం అంత బలపడుతుంది’’ అని రక్షణమంత్రి చెప్పారు. విద్యార్థులు ఎక్కడికి వెళ్లినా విశ్వభారతి పరిమళాన్ని వెదజల్లాలని రాజ్‌నాథ్ సింగ్  ఉద్బోధించారు.

“భారతీయ , ప్రపంచ విజ్ఞాన రంగాల  అద్వితీయ సమ్మేళనం  విశ్వభారతి.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్ఞాన ప్రవాహాన్ని భారతీయ ఆలోచనలోకి విశ్వభారతి సమ్మిళితం చేస్తుంది.  మొత్తం ప్రపంచానికి జ్ఞానోదయం చేస్తుంది” అని ఆయన తెలిపారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయవాదం, సార్వత్రిక మానవతావాదం గురించి విద్యార్థులకు రక్షణ శాఖ మంత్రి వివరిస్తూ గొప్ప తత్వవేత్త అయిన రవీంద్రనాధ్త ఠాగూర్ తన   ఆలోచనలు, తత్వశాస్త్రం, విలువలతో భారతీయ సమాజాన్ని, రాజకీయాలను  ప్రభావితం చేశారని చెప్పారు.

 శతాబ్దాలుగా భారత జాతీయవాదం సహకారం, మానవ సంక్షేమ భావనపై ఆధారపడి ఉందని  రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.  “భారత జాతీయవాదం సాంస్కృతికమైనది  గాని  ప్రాదేశికమైనది కాదు. భౌగోళిక అంశాలతో సంబంధం లేకుండా దేశం  చైతన్యవంతంగా ముందుకు సాగుతుంది.  ప్రజా సంక్షేమం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. భారత జాతీయవాదం ప్రత్యేకవాదం  అందరినీ కలుపుకొని పోతూ  సార్వత్రిక సంక్షేమం స్ఫూర్తితో పనిచేస్తుంది. భారత జాతీయవాదానికి విశ్వభారతి  సూచిక’’ అని వివరించారు.