`అయోధ్యలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయ నిర్మాణం’ కథనాలపై కేసు!

ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో 100 ఎకరాలలో విలాసవంతమైన ఆర్‌ఎస్‌ఎస్ రెండవ ప్రధాన కార్యాలయం నిర్మాణం జరుగుతున్నట్లు వార్తలు రాసిన, ప్రసారం చేసిన మూడు ప్రముఖ వార్తాపత్రికలపై ఆర్‌ఎస్‌ఎస్ అవధ్ ప్రాంత్ ప్రచార్ ప్రముఖ్ డా. అశోక్ కుమార్ దూబే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచే రీతిలో ఈ వార్తలు ఉన్నాయని దూబే తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రస్తుతం నాగ్‌పూర్ కంటే విస్తీర్ణంలో పది రేట్లు ఇది ఉంటుందని పేర్కొన్నారు. దైనిక్ భాస్కర్ కు చెందిన రాకేష్ అగర్వాల్, రమేష్ మిశ్రాలతో పాటు హరిభూమి, న్యూస్ 24 ప్రధాన సంపాదకులపై లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో  ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

`తన 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఆర్‌ఎస్‌ఎస్ తన రెండవ ప్రధాన కార్యాలయాన్ని అయోధ్యలో నిర్మించనుంది. ఇందుకోసం 100 ఎకరాల స్థలం ఇవ్వాలని హౌసింగ్ డెవలప్‌మెంట్ బోర్డును అభ్యర్థించారు. గ్రీన్ ఫీల్డ్‌షిప్ ప్రోగ్రామ్ (నవ్య అయోధ్య) కింద ఈ ఆస్తిని ఆర్‌ఎస్‌ఎస్ కోరుకుంటోందని పేర్కొంటూ  ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా సంఘ్ ప్రతిష్టను కించపరిచే ఉద్దేశ్యపూర్వక చర్యకు వ్యక్తులపై ఆరోపణలు వచ్చాయి’ అని ఎఫ్‌ఐఆర్ చెబుతోంది.

ఫిబ్రవరి 14, 2023న, దైనిక్ భాస్కర్ వెబ్‌సైట్‌లో అయోధ్యలో 100 ఎకరాల్లో మరో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం గురించిన కథనం అప్‌లోడ్ చేశారు. ఇది నాగ్‌పూర్‌లోని ప్రస్తుత ప్రధాన కార్యాలయానికి అదనంగా పని చేస్తుంది. ఈ కథనాన్ని రమేష్ మిశ్రా, స్థానికదైనిక్ భాస్కర్ కరస్పాండెంట్ అయోధ్యలో రూపొందించారు.

న్యూస్ స్లైడ్‌ను కూడా అదే రోజు న్యూస్ 24 ఛానెల్ ప్రసారం చేసింది.’ ఇదే వార్తను ఫిబ్రవరి 15న ఇతర వార్తా సంస్థలు ప్రచురించాయి. అవి ‘హన్‌భూమి న్యూస్, టీవీ 9, ఫోకస్ 24 వార్తలు, ప్రకాష్ టీవీ, స్టార్‌సవేరా ఛానెల్, జోధానా అబ్‌తక్ న్యూస్ జనదేశ్ టుడే ఛానెల్, ది భారత్ న్యూస్, ఓపి ఇండియా న్యూస్, మ్రా హరియానా న్యూస్, పంజాబ్ కేసరి తదితరులు అంటూ ఎఫ్‌ఐఆర్ వివరించింది.

గత కొన్నేళ్లుగా అయోధ్యలోని సాకేత్ నిలయంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో రాబోతున్న రామమందిరంకు అనుబంధంగా ఈ నిర్మాణం జరుగుతున్నట్లు వార్తాకథనం సూచిస్తున్నది.

వాస్తవాలు తెలుసుకున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఆర్ఎస్ఎస్ సద్భావన, ప్రతిష్ట, వాస్తవాలకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో కళంకిత వార్తలను బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా, ఎటువంటి వాస్తవిక దర్యాప్తు లేకుండా చేస్తున్నట్లు ఫిర్యాదులో ఆరోపించారు. అన్ని పాత్రికేయ విలువలను విస్మరిస్తూ, ఆర్ఎస్ఎస్ ప్రతిష్టను కించపరిచే విధంగా కధనాలు ఉన్నాయని తెలిపారు.

ఆర్‌ఎస్‌ఎస్ తన పంథాను వదిలి రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కై అయోధ్యలో వంద ఎకరాల భూమిని సంపాదించిందినట్లు రాసిన ఈ వార్తతో ప్రజలలో ఆర్‌ఎస్‌ఎస్ పట్ల తప్పుడు అభిప్రాయాలు ఏర్పడే ప్రమాదం ఉందని దూబే తన ఫిర్యాదులో పేర్కొన్నారు.