5 లక్షల ఓబిసి సర్టిఫికేట్లను రద్దు చేసిన కలకత్తా హైకోర్టు

ప‌శ్చిమ బెంగాల్‌లో 2010 నుంచి జారీ చేసిన ఓబీసీ స‌ర్టిఫికెట్ల‌ను తోసిపుచ్చుతూ క‌ల‌క‌త్తా హైకోర్టు బుధ‌వారం సంచ‌ల‌న ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఓబీసీ స‌ర్టిఫికెట్ల జారీ ప్ర‌క్రియ‌ను స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ విచారిస్తూ జ‌స్టిస్ త‌ప‌బ్ర‌త చ‌క్త‌వ‌ర్తి, రాజ‌శేఖ‌ర్ మంథాల‌తో కూడిన డివిజ‌న్ బెంచ్ తీర్పును వెలువ‌రించింది. 
 
ప‌శ్చిమ బెంగాల్ వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల చ‌ట్టం 1993కు అనుగుణంగా రాష్ట్ర బీసీ క‌మిష‌న్ ఓబీసీల తాజా జాబితా రూపొందించాల‌ని కోర్టు ఆదేశించింది.  2010 త‌ర్వాత త‌యారుచేసిన ఓబీసీ జాబితా చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని హైకోర్టు బెంచ్ స్ప‌ష్టం చేసింది. ప‌శ్చిమ బెంగాల్ వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల చ‌ట్టం, 2012లోని సెక్ష‌న్ 2హెచ్‌, 5,6, సెక్ష‌న్ 16, షెడ్యూల్ 1, షెడ్యూల్ 3లు రాజ్యాంగ‌విరుద్ధ‌మ‌ని కొట్టివేసింది. 
 
అయితే, తమ ఉత్తర్వుల ప్రభావం ఇప్పటికే ఉద్యోగాలు, పథకాల లబ్ధి పొందిన వారిపై ఎటువంటి ప్రభావం చూపవని తెలిపింది. 2010 త‌ర్వాత జారీ చేసిన ఓబీసీ స‌ర్టిఫికెట్లు అన్నీ 1993 (బీసీ క‌మిష‌న్‌) చ‌ట్టాన్ని ఉల్లంఘించి జారీ చేశార‌ని పిటిష‌న్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. వాస్త‌వంగా వెనుక‌బ‌డిన త‌ర‌గతుల వారికి ద‌క్కాల్సిన స‌ర్టిఫికెట్లు వారికి ల‌భించ‌లేద‌ని పేర్కొంది. 
 
కోర్టు ఆదేశాల‌తో 2010 త‌ర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీ స‌ర్టిఫికెట్లు ర‌ద్ద‌య్యాయి. కాగా, 2010కి ముందు జారీ చేసిన ఓబీసీ స‌ర్టిఫికెట్ల‌పై తీర్పు ప్ర‌భావం ఉండ‌దు. 2010కి ముందు 66 తరగతులుగా క్లాసిఫై చేసిన ఓబీసీల జోలికి తాము వెళ్లడం లేదని, పిటిషన్‌లో వాటిని సవాలు చేయలేదని ధర్మాసనం పేర్కొంది.
 
కాగా, 2010 తర్వాత అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పు తమకు ఆమోదయోగ్యం కాదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.  ఓబీసీ రిజ‌ర్వేష‌న్ కొన‌సాగుతుంద‌ని, ఇది ఎప్ప‌టికీ కొన‌సాగుతుంద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ పున‌రుద్ఘాటించారు.  ”హైకోర్టు ఆదేశం అందింది. కానీ మేము దీనిని అంగీకరించం. బీజేపీ వల్ల 26,000 మంది తమ ఉద్యోగాలు కోల్పోతారు. బీజేపీ ఆర్డర్‌ను మేము అంగీకరించే ప్రసక్తి లేదు. ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయి” అని మమతా బెనర్జీ తేల్చి చెప్పారు.
 
అయితే, ఎలాంటి స‌ర్వే చేప‌ట్ట‌కుండా మ‌మ‌తా బెన‌ర్జీ 118 ముస్లిం కులాల‌కు ఓబీసీ రిజ‌ర్వేష‌న్ ఇచ్చార‌ని, దీంతో కొంద‌రు కోర్టును ఆశ్ర‌యించ‌గా ఈ ఆదేశాలు జారీ అయ్యాయ‌ని చెబుతూ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు  కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బీసీల‌కు ఉద్దేశించిన రిజ‌ర్వేష‌న్‌ను కొల్ల‌గొట్టి వాటిని త‌మ ఓటు బ్యాంక్‌కు అందించాల‌ని మ‌మ‌తా బెన‌ర్జీ కోరుకున్నార‌ని ఆయన ధ్వజమెత్తారు.  ఆపై బీసీ కోటాను ముస్లిం కులాల‌కు మ‌మ‌తా బెన‌ర్జీ క‌ట్ట‌బెట్టార‌ని అమిత్ షా ఆరోపించారు.
 
 హైకోర్టు నిర్ణ‌యాన్ని తాము ఆమోదించ‌బోమ‌ని మ‌మ‌తా బెన‌ర్జీ చెబుతున్నార‌ని, కోర్టు ఉత్త‌ర్వుల‌ను మ‌న్నించ‌బోమ‌ని చెప్పే ఇలాంటి ముఖ్య‌మంత్రి ఎవ‌రైనా ఉన్నారా? అని తాను రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను అడుగుతున్నాన‌ని ఆయన చెప్పారు. తెలంగాణ‌, క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ ఓబీసీ రిజ‌ర్వేష‌న్‌ను నీరుగార్చింద‌ని అమిత్ షా దుయ్య‌బ‌ట్టారు. 
 
ఇప్పుడు మ‌మ‌తా బెన‌ర్జీ ఓబీసీ రిజ‌ర్వేష‌న్‌కు తూట్లు పొడిచార‌ని ఆయన మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజ‌ర్వేష‌న్ల‌ను వీరు కొల్ల‌గొట్టి మైనార్టీలు ముఖ్యంగా ముస్లింల‌కు వాటిని క‌ట్ట‌బెడుతున్నార‌ని ఆరోపించారు. ఈ వైఖ‌రిని బీజేపీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తుంద‌ని, మ‌త ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్ల‌కు బీజేపీ వ్య‌తిరేక‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.