ఎట్టేకేలకు మౌనం వీడిన కేజ్రీవాల్ 

ఢిల్లీ లిక్కర్ కేసు ఉచ్చులో పీకలదాకా మునిగిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీకి మరో పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇప్పటికే ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా ఇప్పుడు సొంత పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వ్యవహారం ఆ పార్టీని మరింత ఇరుకున పడేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి   బిభవ్ కుమార్ ముఖ్యమంత్రి నివాసంలోనే తనపై తీవ్రంగా దాడి చేశారని స్వాతి మలివాల్ ఆరోపించడంతో మొదలైన ఈ వ్యవహారం బిభవ్ కుమార్ అరెస్ట్ అయినా ఆగలేదు.

ఈ ఘటనపై ఆప్‌ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తుండగా ఆప్ వాటిని తిప్పికొడుతోంది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారంపై అస్సలు నోరు మెదపని ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ఎట్టేకేలకు మౌనం వీడి స్పందించారు.  స్వాతి మలివాల్‌పై తన పర్సనల్ సెక్రటరీ బిభవ్ కుమార్ దాడి చేసినట్లు వస్తున్న ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్‌ తొలిసారి బుధవారం స్పందించారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగడంతో పాటు స్వాతి మలివాల్‌కు న్యాయం అందుతుందని తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిగి న్యాయం జరగాలని పేర్కొన్నారు.  అంతేకాకుండా ఈ కేసులో రెండు కోణాలు ఉన్నాయని,ఇద్దరి నుంచి నిష్పక్షపాతంగా విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందుతుందని కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున అంతకుమించి తాను ఏమీ మాట్లాడలేనని ఓ ఇంటర్వ్యూలో కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

కొన్ని రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ఇంట్లోని డ్రాయింగ్‌ రూంలో వేచి ఉన్న స్వాతి మలివాల్‌తో.. ఆయన పీఏ బిభవ్‌ కుమార్ అమర్యాదగా ప్రవర్తించారని, అంతేకాకుండా ఆమెపై దాడి చేసినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం ఆమ్ ఆద్మీ పార్టీలోనే తీవ్ర దుమారం రేపింది. దీంతో ఈ కేసులో బిభవ్‌ కుమార్‌ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు అతడ్ని ముంబైకి తీసుకెళ్లారు. బిభవ్ కుమార్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సీసీటీవీ రికార్డులను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించారు.