ఓటమితో ముగిసిన సానియా క్రీడా ప్రస్థానం

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా టెన్నిస్‌ కెరియర్‌ ఓటమితో ముగిసింది.  దుబాయిలో జరుగుతున్న డబ్ల్యూటీఏ డ్యూటీ ఫ్రీ చాంపియన్‌ షిప్‌లో సానియా జోడి ఓటమిపాలైంది. సానియా మీర్జా అమెరికా భాగస్వామి మాడిసన్‌ కీస్‌తో కలిసి వరుస సెట్లలో పరాజయం పాలైంది.

4-6, 0-6తో రష్యాకు చెందిన వెర్నోకియా కుడెర్మెటోవా, లియుడ్‌మిలా శాంసోనోవా జోడి చేతిలో ఓటమి పాలైంది. ఇక కెరీర్‌లో చివరి టోర్నీ ఆడిన సానియా ఓటమి అనంతరం కన్నీళ్ల పర్యంతరమైంది. సుదీర్ఘ కాలం పాటు భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన సానియా ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను సొంతం చేసుకుంది.

ఈ ఏడాది జనవరిలో టెన్నిస్‌కు సానియా రిటైర్‌మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 36 సంవత్సరాల సానియా తన 20 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో ఆరు డబుల్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను గెలుచుకుంది.

కెరీర్‌లో డబుల్‌ వరల్డ్‌ నెంబర్‌ వన్‌గా 91 వారాలు కొనసాగింది. అంతకు ముందు సింగిల్స్‌నూ సత్తాచాటింది. వరల్డ్‌ ర్యాకింగ్స్‌లో 27వ స్థానానికి చేరింది. 2005లో యూఎస్‌ ఓపెన్స్‌లో నాల్గో రౌండ్‌కు చేరింది. గతేడాది రిటైర్‌మెంట్‌ను ప్రకటించిన సమయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది.

తల్లిదండ్రులు, కోచ్‌, ఫిజియో, మొత్తం టీం మద్దతు లేకపోయి ఉంటే కెరీర్‌లో ఈ స్థాయి వరకు చేరుకునేదాన్ని కాదని చెప్పింది. ఇదిలా ఉండగా కెరియర్‌లో చివరి టోర్నీ ఆడేందుకు దుబాయికి చేరుకున్న సానియా ఓ చానెల్‌తో మాట్లాడుత పోటీపడడం, గెలవడం, పోరాడడం వల్ల కలిగే అనుభూతిని కోల్పోతానని పేర్కొంది.

పెద్ద కోర్టుల్లో ప్రేక్షకుల కేరింతల మధ్య అడుగు పెడుతున్నప్పుడు కలిగే భావనే ప్రత్యేకంగా ఉంటుందని, అది ఇక నుంచి తనకు లభించదని, అన్నింటికన్నా ముఖ్యంగా రసవత్తర పోటీకి దూరమవుతానని చెప్పింది. అయితే, ఆట కోసం కోసం తాను ఎలాంటి సామాజిక నిబంధనలను ఉల్లంఘించలేదనని చెప్పింది. టెన్నిస్‌కు దూరమైనా సానియా క్రికెట్‌ స్టేడియంలో సందడి చేయనున్నది. త్వరలో జరుగనున్న వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు మెంటర్‌గా నియాకమైన విషయం తెలిసిందే.