ఉక్రెయిన్ లో యుద్దానికి యుద్దానికి పాశ్చాత్య దేశాల నేతలే కారణమని స్పష్టం చేస్తూ పాశ్చాత్య ప్రపంచం యుద్ధాన్ని ప్రేరేపించగా దాన్ని నిరోధించేందుకు రష్యా బలప్రయోగానికి దిగిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలను ప్రారంభించి ఏడాది కావస్తున్న సందర్భంగా ఫెడరల్ అసెంబ్లీ ఎదుట మంగళవారం పుతిన్ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ రెండు దేశాల మధ్య నెలకొన్న స్థానిక సమస్యను ప్రపంచ యుద్ధంగా మార్చేందుకు అమెరికా వంటి పశ్చిమ దేశాలు యత్నిస్తున్నాయని ఆరోపించారు.
పశ్చిమ దేశాలు తూర్పు దిశగా దూకుడు పెంచాయని చెబుతూ తూర్పు దేశాలను నాశనం చేయాలన్న ఉద్దేశంతో పశ్చిమ దేశాలు ఉన్నట్లు ఆయన హెచ్చరించారు. ఉక్రెయిన్, డాన్‌బాస్.. అబ్దాలకు గుర్తులుగా మారాయని అంటూ నాటో దళాన్ని పెంచుతూ పశ్చిమ దేశాలు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ధ్వజమెత్తారు.
ఉక్రెయిన్‌పై యుద్ధానికి పశ్చిమ దేశాలే కారణమని స్పష్టం చేస్తూ వాళ్ల దూకుడును అడ్డుకునేందుకు సైన్యాన్ని వాడుతున్నామని పుతిన్ తెలిపారు. డాన్‌బాస్ ప్రాంతంలో సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నించామని, కానీ పశ్చిమ దేశాలు క్రూరపద్ధతిలో వ్యవహరించిందని మండిపడ్డారు.
ఉక్రెయిన్‌లో మనకెదురయ్యే టాస్క్‌లను సమర్ధవంతంగా నిలకడగా రష్యా పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. శాంతియుతంగా ఈ సమస్యకు పరిష్కారం సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడుతున్నామని చెప్పారు. ఇక ఉక్రెయిన్‌పై రష్యా దమనకాండను పుతిన్ ప్రత్యేక సైనిక ఆపరేషన్‌గా పిలవడం గమనార్హం.
రష్యాపై యుద్ధాన్ని బలవంతంగా రుద్దారని పేర్కొంటూ యుద్ధంలో సైనికులను కోల్పోయిన కుటుంబ సభ్యుల బాధను తాను అర్ధం చేసుకోగలనని తెలిపారు. సైనికులకు, వాళ్ల కుటుంబాలకు పుతిన్ ధన్యవాదాలు తెలుపుతూ శిరసు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. యుద్ధభూమిలో రష్యాను ఓడించలేమనే వాస్తవాన్ని పాశ్చాత్య దేశాలు అంగీకరించలేవని చెబుతూ రష్యాను యుద్ధభూమిలో ఓడించలేమనే పశ్చిమ దేశాలు సమాచార యుద్ధానికి తెరలేపాయని విమర్శించారు.
క్రెయిన్‌లో యుద్ధానికి ఆజ్యం పోయడం, బాధితుల సంఖ్య పెరగడం వెనుక పూర్తి బాధ్యత పశ్చిమ దేశాల ప్రముఖులదేనని చెప్పారు. తాము తగిన సమయంలో తగిన విధంగా ప్రతిస్పందిస్తామని పేర్కొంటూ తాము తమ దేశ ఉనికి గురించి మాట్లాడుతున్నామని చెప్పారు.
పుతిన్ తన ప్రసంగంలో ఎల్జీబీటీ హక్కుల గురించి మరోసారి ప్రత్యేకంగా ప్రస్తావన చేశారు. కుటుంభం అంటే ఆడ, మగ కలయిక అని, ప్రతి మత గ్రంథాలు ఈ విషయాన్నే చెబుతాయని గుర్తు చేశారు. కానీ ఆ పవిత్ర గ్రంథాలను పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగజారుడతనం నుంచి మన చిన్నారుల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని పుతిన్ తెలిపారు.
More Stories
హసీనా మేనకోడలు బ్రిటన్ మంత్రిగా రాజీనామా
ఎట్టకేలకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యేల్ అరెస్ట్
100 `నాసిరకపు’ పారిస్ ఒలింపిక్ పతకాలు వాపస్