అమెరికాతో అణుఒప్పందం నుండి రష్యా నిష్క్రమణ

అమెరికాతో కుదిరిన కీలక అణ్వాయుధాల నూతన ఒప్పందంలో తమ ప్రాతినిధ్యాన్ని రద్దు చేసుకుంటున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ మంగళవారం వెల్లడించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా అమెరికాతో రష్యాకు ఉద్రిక్తత లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యూహాత్మక ఆయుధాల ఒప్పందం (స్ట్రాటెజిక్ ఆర్మ్ రిడక్షన్ ట్రీటీ ఎస్‌టిఎఆర్‌టి)లో పాలుపంచుకోవడాన్ని రద్దు చేసుకుంటున్నట్టు పుతిన్ స్పష్టం చేశారు.

అమెరికా ఈ విధంగా వ్యవహరించినట్టయితే అణ్వాయుధాల వినియోగాన్ని రష్యా తిరిగి ప్రారంభిస్తుందని హెచ్చరించారు. ఈ చర్య అణ్వాయుధాల పరీక్షలపై ప్రపంచ దేశాల్లో ఉన్న ఆంక్షలకు ముగింపు పలుకుతుంది. ఈ నిర్ణయాన్ని వివరిస్తూ అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌లో రష్యా ఓటమే తమ లక్షంగా బహిరంగంగా ప్రకటించాయని గుర్తు చేశారు. అవి వ్యూహాత్మక ఓటమిని కలిగించడానికి యత్నిస్తున్నాయని, తమ అణ్వాయుధాలను పొందడానికి చూస్తున్నాయని పుతిన్ పేర్కొన్నారు.

ఈ ఒప్పందం కింద రష్యా అణ్వాయుధాలను తిరిగి పరీక్షించడానికి అమెరికా ముందుకు తోస్తోందని ఆరోపించారు. రష్యా అణ్వాయుధ సామర్థ బాంబుల ప్రయోగాన్ని అడ్డుకోడానికి రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు నిర్వహించేలా నాటో దేశాలు ఉక్రెయిన్‌కు సహాయం చేస్తున్నాయని ఆరోపించారు. నాటో నైపుణ్య అత్యంత ఆధునికమైన డ్రోన్లు వినియోగించినట్టు వివరించారు.

ఇంతా చేసి వారిప్పుడు తమ రక్షణ స్థావరాల్లో తనిఖీలు చేయాలనుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో వెర్రితనం అని పుతిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా పూర్తిగా అసంబద్ధమైనదని స్పష్టం చేశారు. అయితే, ఈ ఒప్పందంలో తమ జోక్యాన్ని విరమించుకుటున్నాం తప్ప పూర్తిగా వైదొలగలేదని వివరించారు.

2010లో అప్పటి అమెరికా అధ్యక్షులు బరాక్‌ ఒబామా, నాటి రష్యా అధ్యక్షులు డిమిట్రీ మెద్వెదేవ్‌ సంతకాలు చేయడంతో అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా, రష్యా ఇరు దేశాలూ తమతమ అణ్వాయుధ స్థావారాలను 1500కు మించి మోహరింపజేయరాదని, అలాగే 700కు మించి క్షిపణులు కానీ, లేదా బాంబర్లను కానీ మోపరింపజేయరాదు.

1550 అణ్వాయుధాలు, 700 క్షిపణులు, బాంబర్లు మించి వీటిని పెంచుకోరాదని రెండు దేశాలు పరిమితి విధించుకున్నాయి. ఈ ఒప్పందాన్ని పరిశీలించడానికి క్షేత్రస్థాయిలో తనిఖీలపై విస్తృత చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ ఒప్పందం గడువు 2021 ఫిబ్రవరిలో ముగిసే సమయానికి కొద్ది రోజుల ముందు రష్యా, అమెరికా దేశాలు మరో ఐదేళ్ల పాటు ఈ ఒప్పందాన్ని పొడిగించుకోడానికి అంగీకరించాయి.సందేహం కలిగినప్పుడు పరస్పరం తనిఖీలు చేసుకునే అధికారాన్ని కూడా ఈ ఒప్పందం కల్పిస్తోంది.

వాస్తవానికి 2021 ఫిబ్రవరితోనే ఈ ఒప్పందానికి కాలం చెల్లింపోవాల్సివుండగా..దానిని మరో ఐదేళ్లకు పొడిగిస్తూ ఇరుదేశాలు సంతకాలు చేశాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైన దగ్గర నుంచి కొత్త ఒప్పందం కింద పరస్పర తనిఖీలను రెండు దేశాలు రద్దు చేసుకున్నాయి. కానీ ఒప్పందం భవిష్యత్తు అనిశ్చితిగా భావించి రష్యా తిరిగి ఒప్పందాన్ని కొనసాగించడానికి తిరస్కరించింది. అలాగే ఈ ఒప్పందం కింద చర్చలు సాగించడాన్ని రష్యా నిరవధికంగా వాయిదా వేసింది.