చెన్నై, ఢిల్లీ నగరాల్లో భూప్రకంపనలు

ఉత్తరాదిలో బుధవారం మధ్యాహ్నం పలు చోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, హరియాణాలోని పలు చోట్ల భూమి కంపించింది. పొరుగున ఉన్న నేపాల్‌లోనూ భూకంపం సంభవించింది.  నేపాల్‌ కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం తీవ్రత భూకంప లేఖినిపై 4.8గా నమోదైంది.
 
నేపాల్‌లో ఈ భూకంపం తీవ్రత 5.2గా నమోదైనట్లు జాతీయ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. ఈ ప్రభావం ఉత్తర ప్రదేశ్‌లో కూడా కనిపించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ వెల్లడించింది. నేపాల్‌లోని బజురలో బుధవారం మధ్యాహ్నం 1.45 గంటలకు భూకంపం సంభవించినట్లు నేపాల్‌ జాతీయ భూకంప పర్యవేక్షక, పరిశోధన కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు గుర్తించింది.
 
మరోవైపు, దక్షిణాదిలోని చెన్నై నగరంలోనూ స్వల్పంగా భూమి కంపించింది. బుధవారం ఉదయం అన్నా సలాయ్, వైట్స్ రోడ్డులో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు స్థానికులు తెలిపారు. ప్రకంపనలతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న మెట్రో నిర్మాణ పనులు వల్ల ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు నివేదికలు వస్తున్నాయి.
 
అయితే, మెట్రో అధికారులు మాత్రం వీటిని ఖండించారు. ప్రకంపనలు లేదా భూకంపాలను ప్రేరేపించే పని ప్రస్తుతం జరగడం లేదని చెప్పారు. జాతీయ భూకంప కేంద్రం సైతం చెన్నైలో భూ ప్రకంపనలు చోటుచేకోలేదని తెలిపింది. ‘చెన్నైలో స్వల్ప భూప్రకంపనలు వచ్చినట్టు ఢిల్లీలోని జాతీయ భూకంపాల పరిశోధన కేంద్రం సమాచారం ఇచ్చింది.. కానీ, అటువంటి డేటా తమ ఆఫీసులో నమోదు కాలేదు’ అని దక్షిణాది వాతావరణ పరిశోధన కేంద్రం చీఫ్ బాలచంద్రన్ పేర్కొన్నారు.
 
కాగా, టర్కీ మాదిరిగా భారత్‌లోనూ భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరించారు. ఉత్తరాఖండ్‌లో ఎప్పుడైనా శక్తివంతమైన భూకంపం వస్తుందని వారు హెచ్చరించారు.