పరస్పరం ఆరోపణలకు దిగిన కర్ణాటక మహిళా అధికారుల బదిలీ!

సోషల్ మీడియాలో పరస్పరం వ్యక్తిగత ఆరోపణలకు దిగిన ఇద్దరు సీనియర్ మహిళా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కర్ణాటక రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ ఐఏఎస్‌ రోహిణి సింధూరి, రాష్ట్ర చేతివృత్తుల కార్పొరేషన్‌ ఎండీ ఐపీఎస్‌ రూపా మౌద్గల్‌ పరస్పర ఆరోపణల వ్యవహారంలో ఇద్దరికీ పోస్టింగ్ ఇవ్వకుండానే తక్షణమే బదిలీ చేసింది.
 
వివాదం చెలరేగిన మరుసటి రోజునే ఇద్దరినీ వారివారి శాఖల నుంచి గెంటేసినంత పనిచేసింది. ఇరువురూ కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ఫిర్యాదు చేసిన మరుసటి రోజు మంగళవారం ఈ పరిణామం చోటుచేసుకుంది. రూపా మౌడ్గిల్‌ భర్త ఐఏఎస్ మునీష్‌ మౌడ్గిల్‌ ను కూడా బదిలీ చేసింది. ప్రస్తుతం రెవెన్యూ విభాగంలో కమిషనర్‌గా ఉన్న ఆయన్ను డీపీఏఆర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
 
ఇద్దరు మహిళా అధికారులపై చర్యలుంటాయని కర్ణాటక హోం మంత్రి అరాగ జ్ఞానేంద్ర హెచ్చరించిన మర్నాడే బదిలీ చేయడం గమనార్హం. ఐఏఎస్‌ రోహిణి సింధూరి, ఐపీఎస్‌ రూపా మౌద్గల్‌ తీరుపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మండిపడ్డారు. ఈ మేరకు ఇద్దరు అధికారులకు నోటీసులు జారీ చేయాలని ప్రధాన కార్యదర్శిని సోమవారం ఆదేశించారు.
 
అందుకు అనుగుణంగానే సోమవారం మధ్యాహ్నం ఐఏఎస్‌ రోహిణి సింధూరి విధానసౌధలో ప్రధాన కార్యదర్శి వందితాశర్మతో భేటీ అయ్యారు.  నాలుగు పేజీలతో ఐపీఎస్‌ రూపా మౌద్గల్‌ ఆరోపణలకు ఆమె వివరాలను అందించారు. తనపై సోషల్‌ మీడియాలో నిరాధార, అబద్ధాలు, వ్యక్తిగతమైన ఆరోపణలు చేశారని, సర్వీస్‌ రూల్స్‌ను ఉల్లంఘించిన మేరకు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత ఐపీఎస్‌ రూపా మౌద్గల్‌ కూడా ఆమెతో భేటీ అయి తన వాదనను వినిపించారు.
కర్ణాటకలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. పలు వివాదాలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవదాయశాఖ కమిషనర్‌ రోహిణి సింధూరి(ఐఏఎస్‌)పై హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రూపాముద్గల్‌(ఐపీఎస్‌) ఆదివారం ట్విటర్‌ ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు. రోహిణి వ్యక్తిగత ఫొటోలను కూడా అందులో పోస్ట్‌ చేశారు.

ఐఏఎస్‌ రోహిణి, ఎమ్మెల్యే సారా మహేశ్‌తో రాజీ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని రూప ప్రశ్నించారు. ‘చామరాజనగరలో కరోనా వేళ ఆక్సిజన్‌ అందక పలువురు మరణించిన అంశంలోనూ సక్రమంగా వ్యవహరించారా? కరోనాతో దేశమంతటా జనం తల్లడిల్లుతుంటే మైసూరు కలెక్టరేట్‌లో విలాసవంతమైన స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మించడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి’ అని విమర్శించారు.

ఐపీఎస్‌ ఎన్‌.హరీశ్‌ మృతిపైనా ఆమె అనుమానం వ్యక్తం చేశారు. జాలహళ్లిలో విలాసవంతమైన ఇల్లు నిర్మించే విషయాన్నీ ప్రస్తావించారు. ఆమెకు ఎవరు మద్దతిస్తున్నారో? ఇటువంటి వారికి ఎందుకు శిక్షలు పడవో అర్థం కావడం లేదన్నారు. కాగా, తనపై ఆరోపణలు చేసిన రూపపై న్యాయ పోరాటం చేస్తానని రోహిణి ఒక ప్రకటనలో తెలిపారు. ‘బాధ్యతాయుతమైన హోదాల్లో ఉన్నవారు సమాజానికి మంచి పనులు చేయాలిగానీ, వ్యక్తిగత విషయాలపై అబద్ధాలు పోస్టు చేయడం సరికాదు’ అని చెప్పారు.