విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. అత్యంత వేగంగా 25 వేల పరుగులు సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ రికార్డ్ విరాట్ సొంతమైంది.

549 అంతర్జాతీయ మ్యాచుల్లో కోహ్లీ 25 వేల పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న సచిన రికార్డును కోహ్లీ బద్దలుగొట్టాడు. సచిన్ ఖాతాలో మొత్తం 34,437 పరుగులున్నాయి. టెండూల్కర్ 577 ఇన్నింగ్స్‌లలో 25 వేల పరుగులు సాధిస్తే కోహ్లీ 28 మ్యాచ్‌ల ముందే ఆ రికార్డును అందుకున్నాడు.

కోహ్లీ, సచిన్ తర్వాతి స్థానాల్లో రికీ పాంటింగ్ (588), జాక్వెస్ కలిస్ (594), కుమార సంగక్కర (608), మహేల జయవర్ధనె (701) ఉన్నారు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన వారిలో కోహ్లీ ఆరోవాడు కాగా, రెండో ఇండియన్ బ్యాటర్. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన విరాట్ అనతి కాలంలో అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా 11 వేల పరుగులు సాధించిన రికార్డు కూడా అతడి పేరునే ఉంది. అలాగే, 105 టెస్టుల్లో 8,131 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి. అలాగే, 115 టీ20ల్లో 4,008 పరుగులు చేశాడు.

664 మ్యాచుల్లో 34,357 పరుగులు చేసిన సచిన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర 594 మ్యాచుల్లో 28,016 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. రికీ పాంటింగ్ ( 560 మ్యాచుల్లో 27,483), మహేల జయవర్ధనె (652 మ్యాచుల్లో 25,957), జాక్వెస్ కలిస్ (519 మ్యాచుల్లో 25,534) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

జడేజా 21 ఏళ్ల రికార్డు బ‌ద్ధ‌లు కొట్టిన జడేజా 

కాగా, ఆస్ట్రేలియాపై రెండో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో కెరీర్ బెస్టు గ‌ణాంకాలు న‌మోదు చేసాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల‌తో ఆసీస్‌ను దెబ్బ కొట్టిన అత‌ను ఈ ఫార్మాట్‌లో రెండోసారి ప‌ది వికెట్ల ఫీట్ సాధించాడు. అంతేకాదు ఈ టెస్టులో జడేజా 21 ఏళ్ల రికార్డు బ‌ద్ధ‌లు కొట్టాడు.

ఒకే ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్ల‌ను బౌల్డ్ చేసి అత‌ను ఈ రికార్డు సృష్టించాడు. భార‌త లెజెండ‌రీ స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లే త‌ర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో స్పిన్న‌ర్‌గా నిలిచాడు. 21 ఏళ్ల క్రితం, అంటే 1992లో జోబ‌ర్గ్‌లో ఐదుగురు ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్స్‌ను కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో బౌల్డ్ చేశాడు.

ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో మార్న‌స్ ల‌బూషేన్, అలెక్స్ క్యారీ, ప్యాట్ క‌మిన్స్, నాథ‌న్ ల‌యాన్‌, కుహ్నేమాన్‌ల‌ను జ‌డేజా బౌల్డ్ చేశాడు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ కూడా ఈ ఫీట్ సాధించాడు. 2002లో లాహోర్‌లో న్యూజిలాండ్‌పై ఈ రావ‌ల్పిండి ఎక్స్‌ప్రెస్ ఐదుగురిని బౌల్డ్ చేశాడు.