కాషాయ జెండా పట్టేవాళ్లే నిజమైన హిందువులు

 
‘‘మీరు ఏ పార్టీ జెండా అయినా పట్టుకోండి… ఇబ్బంది లేదు. కానీ కాషాయ జెండా నీడలో పనిచేసేటోడే నిజమైన హిందువు. వాళ్లనే హిందూ సమాజం గుర్తిస్తుంది. ఓట్ల కోసం డ్రామాలు చేసేటోళ్లను చీత్కరించండి’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండలంలోని గూడెంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ శివాజీ చరిత్ర అందరూ తెలుసుకోవాలని కోరారు.
 
 ఊరూరా శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెబుతూ సోషల్ మీడియాలో శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో హిందుత్వ వాతావరణం వచ్చేసిందని సంజయ్ తెలిపారు.  శివాజీ మహారాజ్ హిందూ ధర్మం కోసం, హిందూ సమాజ సంఘటన కోసం పనిచేసిన దేవుడని కొనియాడారు.
 
నాకెందుకులే అనుకుంటే హిందుత్వం ఉండేది కాదని అంటూ శివరాత్రి పర్వదినం శివాజీ పండుగకు సంబంధం ఉందని చెప్పారు.  మొగల్స్ శివలింగం మీద మూత్రం పోస్తే ఆనాడు చిన్న వయసులోనే ఉన్న శివాజీ రగిలిపోయిండని గుర్తు చేశారు. పెద్దయ్యాక యుద్దం చేసి తరిమి తరిమికొట్టిండని పేర్కొన్నారు.
 
ఆరోజు మొగల్స్ ఉంటే… ఈరోజు మజ్లిస్ వంటి మత చాందస పార్టీలొచ్చినయని సంజయ్ ధ్వజమెత్తారు. నేడు అయ్యప్పను, సరస్వతి అమ్మవార్లను కించపరిస్తే మాట్లాడకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.  “మనకు కష్టాలొస్తే దేవుళ్లు గుర్తొస్తారు…. దేవుళ్లను కించపరిస్తే స్పందించకపోవడం అన్యాయం. హిందూ ద్రోహులుగా మిగిలిపోతాం” అని హెచ్చరించారు.
 
ఇకపై ఊరుకోవద్దని, హిందూ ధర్మాన్ని కించపరిస్తే తరిమి తరిమి కొడదామని పిలుపిచ్చారు. వందేళ్లు బతకడం కంటే.. బతికినన్నాళ్లు దేశం కోసం, ధర్మం కోసం పనిచేద్దామని చెప్పారు. ఏ లక్ష్యం కోసం శివాజీ యుద్దం చేశారో ఆయన ఆశయాలను సాధించుకుందామని పేర్కొంటూ ధర్మ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ క్రుషి చేయాలని కోరారు.