మనీశ్ సిసోడియాకు మరోసారి సమన్లు!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సిబిఐ మరోసారి శనివారం సమన్లు జారీ చేసింది. ఛార్జీషీటు దాఖలు చేసిన మూడు నెలల తర్వాత సమన్లు జారీ చేసినట్లు సిబిఐ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని సిసోడియా శనివారం తెలిపారు.

ఆదివారం తమ ప్రధాన కార్యాలయానికి రావాలని సీబీఐ పిలిపించిందని ట్వీట్ చేశారు. సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా లభించిన తాజా సాక్ష్యాధారాల ఆధారంగా విచారణకు పిలిచారు. దేశ రాజధానికి నూతన ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో జరిగిన అవినీతి ఆరోపణకలు సంబంధించి ఈ సమన్లు వచ్చాయి.

సిసోడియాను ప్రశ్నించేందుకు సిబిఐ పిలిచింది. అయితే అభియోగపత్రంలో ఆయనని నిందితుడిగా పేర్కొనలేదని అధికారులు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ అరెస్టు చేసిన వారిలో విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి తదితరులు ఉన్నారు.

ఈ కేసులో సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ గతేడాది ఆగస్టులో ప్రత్యేక కోర్టులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. మద్యం వ్యాపారులకు లైసెన్సులు మంజూరు చేయాలనే ఢిల్లీ ప్రభుత్వ విధానం కొంతమంది డీలర్లకు అనుకూలంగా ఉందని, ఇందుకోసం పలువురు నేతలు లంచాలు తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. కానీ, దీనిని ఆప్ తీవ్రంగా ఖండించింది.

సిబిఐ గతంలోనే ఈ కేసులో సిసోడియాను విచారించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సిసోడియా హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో కేసు నమోదు చేసిన సిబిఐ దర్యాప్తు చేపట్టింది. సిసోడియా సన్నిహితుడు విజయ్ నాయర్‌ను అరెస్టు చేసింది.