స్టేషనరీపై 18 నుంచి 12 శాతానికి తగ్గిన జీఎస్టీ

స్టేషనరీపై జీఎస్టీ 18నుంచి 12శాతానికి తగ్గింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారమన్‌ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన  49వ జీఎస్టీ కౌన్సిల్  సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్టేషనరీపై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో స్టేషనరీ వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి.
 
పెన్సిల్‌, షార్ప్‌నర్లపై జీఎస్టీ తగ్గించింది కేంద్రం. డ్యూరబుల్ కంటైనర్లకు ఉపయోగించే ట్యాగ్స్ ట్రాకింగ్ డివైజ్లుపై ప్రస్తుతం ఉన్న 18శాతం పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ద్రవ బెల్లం వంటి వాటిపై జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అదే లూజ్ అయితే ఎలాంటి జీఎస్‌టీ ఉండదు.
ప్రిప్యాక్డ్, లేబుల్డ్ అయితే 5 శాతం జీఎస్‌టీ పడుతుంది. అంతేకాకుండా ఆలస్యం దాఖలు చేసిన వార్షిక జీఎస్‌టీ రిటర్న్స్‌పై పెనాల్టీను హేతుబద్దీకరించాలని జీఎస్‌టీ కౌన్సిల్ ప్రతిపాదించింది.
 
అలాగే పాన్ మసాలా, గుట్కా వంటి వాటిపై జీఎస్‌టీ అనేది తయారీ దశలోనే పడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇంకా మిల్లెట్స్‌పై ట్యాక్స్‌కు సంబంధించిన అంశాలను వచ్చే జీఎస్‌టీ కౌన్సిల్‌లో పరిశీలిస్తామని ఆమె తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో కూడా మిషన్ మిల్లెట్స్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వార్షిక టర్నోవర్ రూ. 20 కోట్ల వరకు కలిగిన స్మాల్ ట్యాక్స్‌ పేయర్లకు జీఎస్‌టీఆర్ 9 లేదా వార్షిక రిటర్న్ దాఖలులో ఆస్యం అయితే అప్పుడు ఆలస్య రుసుమును హేతుబద్దీకరిస్తామని వివరించారు.

రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలన్నీ వెంటనే చెల్లిస్తం

కాగా, రాష్ట్రాలకు బకాయి ఉన్న జీఎస్టీ పరిహారం మొత్తాన్ని  తక్షణమే విడుదల చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జూన్ కు సంబంధించి రూ.16,982 కోట్లు పెండింగ్లో ఉన్నాయని నిర్మల చెప్పారు. ప్రస్తుతం కాంపన్సేషన్ ఫండ్ లో అంత మొత్తం లేకపోయినా కేంద్రం సొంత నిధుల నుంచి ఆ మొత్తం చెల్లించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు.
 
భవిష్యత్తులో వసూలు చేసే సెస్ నుంచి ఆ నిధులను సర్దుబాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజా నిర్ణయంతో జీఎస్టీ యాక్ట్ 2017 ప్రకారం రాష్ట్రాలకు గత ఐదేళ్లలో బాకీ ఉన్న మొత్తం క్లియర్ అవుతుందని చెప్పారు.