అరుణాచల్ భారత్‌లో భాగమంటూ అమెరికా సెనేట్ లో తీర్మానం

అరుణాచల్ ప్రదేశ్‌ భారత భూభాగమేనని స్పష్టం చేస్తూ ముగ్గురు అమెరికా సెనేటర్లు గురువారం అమెరికా పెద్దలసభ సెనేట్‌లో తీర్మానం ప్రవేశపెట్టారు. భారత సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలకు మద్దతు ప్రకటిస్తూ ఈ తీర్మానాన్ని రూపొందించారు. ఓరేగాన్ సెనేటర్ జెఫ్ మార్క్లీ, బిల్ హాగర్టీలు సంయుక్తంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మరో సెనేటర్ జాన్ కోర్నిన్ కోస్పాన్సర్‌గా నిలిచారు.

చైనా రెచ్చగొట్టే వైఖరిని సెనేటర్లు ముక్తకంఠంతో ఖండించారు. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులను చైనా తనకు అనుకూలంగా మలచుకునేందుకు సైనికశక్తిని వినియోగిస్తుండటంపై మండిపడ్డారు. స్వీయ రక్షణ లక్ష్యంతో భారత్.. చైనా దూకుడుకు అడ్డుకట్ట కోసం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలిచారు.

అంతేకాకుండా  అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ ప్రాంతంలో భారత్‌కు అమెరికా అండగా నిలవాలన్న ప్రతిపాదనను తమ తీర్మానంలో పొందుపరిచారు. ‘‘ప్రస్తుతం చైనా తన లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచ క్రమాన్ని మార్చాలనుకుంటోంది అయితే.. అమెరికా తీసుకునే చర్యలన్నింటికీ స్వేచ్ఛాస్వాంతంత్ర్యాలను పరిరక్షించాలన్న భావనే కేంద్రంగా ఉండాలి’’ అని వారు తమ తీర్మానంలో స్పష్టం చేశారు.