అల్‌ ఖైదా చీఫ్‌గా ఒసామా అనుచరుడు సైఫ్‌ అల్‌ అదెల్‌

అల్‌ ఖైదా చీఫ్‌గా ఒసామా అనుచరుడు సైఫ్‌ అల్‌ అదెల్‌ (62) నియమితులయ్యారు. ప్రస్తుతం అదిల్‌ అల్‌ ఖైదాను ఇరాన్‌ నుంచి నడిపిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించింది. అమెరికా దాడుల్లో ఐమాన్‌ అల్‌ జవహరి మరణించిన తర్వాత సైఫ్‌ అల్‌ అదెల్‌ అల్‌ ఖైదా చీఫ్‌గా ఎన్నికైనట్లు తెలుస్తున్నది.

తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్ రాజకీయాలలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అల్ ఖైదా ప్రస్తుతం సైఫ్‌ నియామకానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. సైఫ్‌ అల్‌ అదెల్‌ తలపై అమెరికా రూ.82 కోట్ల రివార్డ్‌ పెట్టినట్లుగా సమాచారం.

ఆఫ్ఘనిస్తాన్‌లో 2021 లో అధికారంలోకి వచ్చిన తర్వాత తాలిబన్లు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని నివేదిక పేర్కొన్నది. దాని కారణంగా వారు అమెరికాతో ఒక ఒప్పందంపై సంతకం చేసారని, దానిలో ఏ ఉగ్రవాద సంస్థను వారి భూమి నుంచి కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతించనని ఒప్పందంలో రాసుకున్నారు.

ఈ పరిస్థితుల్లో అల్ ఖైదా కొత్త చీఫ్‌గా సైఫ్ అల్ అదెల్‌ను ప్రకటిస్తే అది తమకు కష్టాలను తీసుకొస్తుందని తాలిబాన్‌ భావించింది. సైఫ్‌ అల్‌ అదెల్‌ పేలుళ్ల నిపుణుడుగా పేరుపొందారు. అదెల్ చాలా కాలంగా ఇరాన్‌లో నివసిస్తున్నందున, దాని చీఫ్‌గా నియమితులవడం పట్ల అల్‌ ఖైదా చాలా రోజులపాటు మౌనంగా ఉన్నదని యూఎన్‌కు చెందిన చాలా మంది సభ్యులు విశ్వసిస్తున్నారు.

ఇరాన్‌ షియా మెజారిటీ దేశమని, ఆ దేశం అధికారం షియా మతాధికారుల చేతుల్లో ఉంటుండగా.. అల్ ఖైదా సున్నీ ఉగ్రవాద సంస్థ అని వారు గుర్తుచేస్తున్నారు. సైప్‌ అల్‌అదెల్ అసలు పేరు మొహమ్మద్‌ సలా అల్‌-దిన్‌ జైదాన్‌. 1960 ప్రారంభంలో ఈజిప్టులో జన్మించిన సైఫ్‌.. అల్‌ ఖైదాలో చేరిన తర్వాత తన పేరును అల్‌ అదెల్‌గా మార్చుకున్నాడు.

సైఫ్ అల్ అదెల్ ఈజిప్టు సైన్యంలో కల్నల్‌గా పనిచేశారు. 1988లో ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ అల్-సదాత్ హత్య అనంతరం సోవియట్ దళాలను తరిమికొట్టేందుకు ఆఫ్ఘన్‌లోని ముజాహిదీన్‌లో చేరడానికి అతను ఈజిప్ట్‌ను వదిలి లెబనాన్ వెళ్లినట్లు తెలుస్తున్నది. ఖార్టూమ్‌లోని ఖాళీ పొలాల్లో పేలుడు పదార్థాలను తయారు చేయడం, ఉపయోగించడం కోసం ఉగ్రవాదులకు శిక్షణ శిబిరాలను సైఫ్‌ నిర్వహించారని సమాచారం.