చైనాలో ప్రముఖ టెక్ బ్యాంకింగ్ వ్యాపారి బావో ఫ్యాన్ అదృశ్యం

అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకులు జాక్ మా కూడా జాడ లేకుండా పోయిన కొద్దికాలానికి తాజాగా చైనాలో  అత్యున్నత స్థాయి టెక్ బ్యాంకింగ్ వ్యాపారి బావో ఫ్యాన్ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.  బానోకు చెందిన పలు రకాలుగా పెట్టుబడుల వ్యాపారంలో ఉన్న చైనా రెనైస్సాన్స్ హోల్డింగ్ లిమిటెడ్కు చెందిన షేర్లు ఉన్నట్లుండి శుక్రవారం నుంచి పతనం చెందుతూ వచ్చాయి.
ఈ విషయంపై ఆందోళన చెందిన కంపెనీ వర్గాలు తమ సంస్థ వ్యవస్థాపకులు బానో తమకు అందుబాటులోకి రావడం లేదని తెలిపాయి. బానో జాడ తెలియని స్థితిలో హాంగ్‌కాంగ్ షేర్ల లావాదేవీల ట్రెడింగ్‌లో 50 శాతం పతన పరిస్థితి ఏర్పడింది.  ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఎందుకు తమకు అందుబాటులోకి రావడం లేదనేది తెలియడం లేదని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రముఖ వ్యాపార దిగ్గజం కన్పించకుండా పోయినట్లు వచ్చిన వార్తలపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ సమాధానం తెలియచేయలేదు. తమకు దీనిపై ఎటువంటి సమాచారం లేదని అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు.
 
ఈ ప్రముఖ వ్యాపారి పరిస్థితి గురించి ఇప్పుడు కంపెనీ షేర్ల దిగజారుడు క్రమంలోనే ప్రపంచానికి తెలిసివచ్చింది. కానీ ఆయన ఎప్పటి నుంచి కన్పించకుండా పొయ్యారనేది స్పష్టం కావడం లేదు.  తమకు ఎదురుతిరిగే టెక్, వ్యాపార వర్గాలపై చైనాలోని జిన్‌పింగ్ సారథ్యపు ప్రభుత్వ యంత్రాంగం పలు విధాలుగా ఉక్కుపాదం మోపుతూ వస్తున్న అంశం చైనాలో సర్వసాధారణం అయి ఉంది. ఈ క్రమంలో ఈ బానో అదృశ్యం తిరిగి ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాలలో సంచలనంగా మారింది.
 
ఇటీవలి కాలంలో ఆయనకు తరచూ ప్రభుత్వ వర్గాల నుంచి విచారణ ఎదురవుతోందని, అధికారులు పలు విషయాలపై ఆరా తీస్తూ వస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. పలు విషయాలపై తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా తెలియచేస్తాడనే పేరున్న బానో కన్పించకుండా పోవడం చైనా పెట్టుబడుల, పరిశ్రమల వర్గాలలో తీవ్ర ఆందోళనకర పరిస్థితిని తెచ్చిపెట్టింది.
 
రాజకీయ ప్రత్యర్థులు కానీ, వ్యాపార, సాంకేతిక దిగ్గజాలు కానీ చైనాలో అధికార యంత్రాంగం విచారణల పరిధిలోకి వచ్చిన దశల్లో చాలా కాలం వరకూ బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేని స్థితికి గురి కావడం చైనాలో పరిపాటి అయింది.