బీఆర్ఎస్ ను వణికించే పార్టీ బీజేపీ మాత్రమే

రాష్ట్రంలో బీఆర్ఎస్ ను వణికించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఉద్యోగులకు జీతాలే సక్రమంగా ఇయ్యలేనోడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలెలా అమలు చేస్తారని ప్రశ్నించారు. రూ. 5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ముంచిన కేసీఆర్ కు మళ్లీ అధికారమిస్తే మరో రూ.5 లక్షల అప్పు చేసి ప్రజల చేతికి చిప్ప ఇస్తారని హెచ్చరించారు.
 
‘ప్రజా గోస – బీజేపీ భరోసా’లో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని రూప్ ఖాన్ పేటలో గురువారం జరిగిన ‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్’ సంజయ్ పాల్గొంటూ  పంచాయతీలకు నిధులివ్వకుండా, ప్రజా ప్రతినిధులు చేసిన పనులకు బిల్లులివ్వకుండా కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
 
బీఆర్ఎస్ లో చేరితేనే ప్రజా ప్రతినిధులకు నిధులిస్తామంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం సిగ్గు చేటన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరతమ బేధం లేకుండా తెలంగాణలోని పంచాయతీలన్నింటికీ నిధులిస్తున్నారని చెప్పారు. ‘‘మోదీ మీలాగే బీజేపీలోనే చేరితేనే నిధులిస్తామని ఆపర్ ఇస్తే… బీఆర్ఎస్ లో ఒక్కరైనా మిగిలేవారా?’’అంటూ ప్రశ్నించారు.
 
బీఆర్ఎస్ కుటుంబ పార్ అంటూ అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు, బంధువులు మాత్రమే పదవుల్లో ఉండాలని,  కొత్త నాయకులను ఎదగనీయరని ఎద్దేవా చేశారు. ఇక, కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని, బీఆర్ఎస్ తో మిలాఖత్ అయ్యిందని పేర్కొంటూ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని గుర్తు చేశారు. ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్ ను ధర్నా చౌక్ కు, అక్కడి ఊర్లలోకి గుంజకొచ్చిన ఘనత బీజేపీదేనని స్పష్టం చేశారు.
 
బీఆర్ఎస్ లోకి వచ్చే వాళ్లంతా చెల్లని కాసులే అంటూ దోచుకున్న పైసలన్నీ పంచి పార్టీలోకి చేర్చుకుంటున్నరని సంజయ్ ఆరోపించారు. ఒక్కసారి వచ్చిన వాళ్లు మరి కేసీఆర్ ను కలవడం లేదని చెబుతూ వారణాసిలో మోదీని ఓడిస్తామని ఇట్లనే ఫ్లెక్సీలు పెట్టి పరువు పోగొట్టుకున్నరని ఎద్దేవా చేశారు. మూతపడే టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ అనే కొత్త దుకాణం పెట్టి దేశమ్మీద పడ్డారని ధ్వజమెత్తారు.
 
బీఆర్ఎస్ అంటేనే అవినీతి, రజకార్ల, కుటుంబ పార్టీగా ప్రజలు భావిస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ను దించాలంటే బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని చెబుతూ  బీజేపీ చేస్తున్న పోరాటాలను చూసి ఆదరిస్తున్నందునే ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీని గెలిపించేందుకు యత్నిస్తున్నారని చెప్పారు.
 
• తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ప్రజలే ముఖ్యమని, అన్ని రాష్ట్రాలు సమానమనే భావనతోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులిస్తోంది. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో మూర్ఖుడు రాజ్యమేలుతున్నడు. అవినీతికి పాల్పడుతున్నడు. తెలంగాణ అభివ్రుద్ధి, సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులిస్తున్నా సీఎం కేసీఆర్ సహకరిస్తలేరని ప్రధానమంత్రి చెప్పారు. 
కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలేవీ రద్దు చేయబోమని సంజయ్ హామీ ఇచ్చారు. అవన్నీ అమలు చేస్తూనే ప్రజలకు ఉపయోగపడేలా కొత్త పథకాలను అమలు చేస్తామని, పైగా,  బీజేపీ అధికారంలోకి ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని ప్రకటించారు.