నిరంతరం దైవంతో ఉండటమే నిజమైన సఫలతకు మార్గం

నిరంతరం దైవంతో ఉండటమే నిజమైన సఫలతకు మార్గమని, నిద్రించేముందు భగవంతుడిని ధ్యానించాలని, తెల్లవారుజామున దైవ సన్నిధిలోనే మేల్కొని ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని యోగదా సత్సంగ సొసైటీ, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ అధ్యక్షుడు స్వామి చిదానందగిరి పిలుపునిచ్చారు. హైదరాబాద్ కన్హా శాంతి వనంలో జరిగిన ఐదు రోజుల సంగం కార్యక్రమాల ముగింపు సమావేశంలో వేలాదిమంది భక్తులను ఉద్దేశించి స్వామి చిదానందగిరి ప్రసంగించారు.

కేవలం తర్కం మీదే ఆధారపడితే అజ్ఞానంలో కూరుకుపోతామని హెచ్చరించారు. తర్కాన్ని ఉపయోగించి ఈ అవిద్య, మాయ నుంచి పూర్తిగా బయటపడటం కష్టమని స్వామి చిదానందగిరి స్పష్టం చేశారు. అంతకంటే ఉన్నతమైనదీ, శక్తిమంతమైన ఆయుధం అవసరమని సూచించారు. క్రియాయోగం అత్యున్నతంగా క్షాళన చేసే శక్తులలో ఒకటని, ఆది తామసిక లక్షణాలనుంచి స్వేచ్ఛను కలిగించి సాత్విక లక్షణాలను పెంపొందిస్తుందని స్వామి చిదానంద గిరి చెప్పారు.

క్రియా యోగ సాధన వల్ల సాత్వికమైన మెదడు, సాత్వికమైన హృదయం, సాత్వికమైన నాడీమండల వ్యవస్థ అనే మూడు ఫలితాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ మూడూ సాధించిన వ్యక్తి దృఢ సంకల్పంతో, దయార్ద్ర హృదయంతో తనకూ, సమాజానికి మంచిని చేకూర్చే నిర్ణయాలు తీసుకుని పనిచేస్తాడని, ఇలా ఉన్నతంగా మారిన వ్యక్తుల ద్వారానే ప్రపంచం మరింత మార్పు చెంది సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని ఆయన సందేశమిచ్చారు.

క్రియా యోగ గురు పరంపరలోని మహాగురువులు, వారి దయా హస్తాలతో రక్షణ హామీ ఇస్తున్నారని, వారి బోధనలు అనుసరించి, వారిని ప్రార్ధిస్తే ఆత్మ సాక్షాత్కారం తథ్యమని, తద్వారా సాధకుడికి శాంతి, జ్ఞానo, ఆనందం లభిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదని స్వామి చిదానందగిరి చెప్పారు.

ధ్యానం ద్వారా ఆత్మాలయం అనే ఆంతరిక దేవాలయంలో ఆత్మ పరమాత్మతో అనుసంధానం చెందినప్పుడు ఆత్మశక్తులన్నీ జాగృతమవువుతాయని స్వామి చిదానందగిరి చెప్పారు. ప్రతి ఒక్కరూ భగవంతునికి ప్రియతములేనని సందేహించకుండా, క్రమం తప్పకుండా క్రియ ధ్యానం చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు.

క్రియ యోగ పాఠాలు కోరుకునేవారు https://yssofindia.org/te/lessons-programmes లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సమన్వయకర్త నారాయణరావు తెలిపారు. మరిన్ని వివరాలకోసం రాంచీ హెల్ప్ డెస్క్ నెంబర్‌0651 6655 555 లో సంప్రదించాలని ఆయన సూచించారు.