ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థపై జోకులు వద్దు కేసీఆర్

2023-24 నాటికి మన ఎకనామీ 5 ట్రిలియన్స్‌కు చేరుతుందనడం పెద్దజోక్‌గా భారత ఆర్ధిక వ్యవస్థను తెలంగాణ సీఎం ఎగతాళి చేయడం పట్ల కేంద్ర ఆర్ధిక మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థపై జోకులు వద్దంటూ ఆమె హితవు చెప్పారు.  ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కోసం అందరూ కృషి చేయాలని, ఇది దేశం కోసమేనని ఆమె స్పష్టం చేశారు.
 
2014 నుండి ఇప్పటివరకు కేంద్రం నుండి తెలంగాణ ప్రభుత్వానికి లక్షా 39వేల కోట్లు గ్రాంట్ రూపంలో వచ్చాయని నిర్మల వివరించారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని నొవోటెల్‭లో కేంద్ర బడ్జెట్ పై దూరదర్శన్ ఏర్పాటు చేసిన.. కాక్లేవ్‭లో ఆమె పాల్గొన్నారు. నంబర్లు, ప్రాజెక్టులు చూసుకొని మాట్లాడాలని టీఆర్ఎస్ ప్రభుత్వంకు ఆమె చురకలు అంటించారు. తెలంగాణలో ఉపాధి హామీకి కేటాయించిన దానికన్నా ఎక్కువగానే ఖర్చు చేస్తున్నామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 
 
తెలంగాణ అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ కేంద్రం భారీగా అప్పులు చేస్తుందని, కేంద్రంలో అసమర్థ పాలకులు ఉన్నారని అంటూ కేసీఆర్ పేర్కొనడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “మాపై విమర్శలు చేస్తున్నారు.. మీ సంగతేంటి?” అని కేసీఆర్‌ను ఆమె ప్రశ్నించారు.
 
తాము దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో.. మెడికల్ కాలేజీలు లేని జిల్లాల పేర్లను పంపాలని కేసీఆర్ సర్కారు చెప్పామని,  అయితే, అప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్న కరీంనగర్, ఖమ్మం జిల్లాల పేర్లను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలుగా పంపిందని ఆమె గుర్తు చేశారు.  తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో అనే విషయం కూడా కేసీఆర్‌కు తెలియదా? అని ఆమె ఎద్దేవా చేశారు.
 
తెలంగాణ రాష్ట్రం నుంచి డేటా సరిగా ఇవ్వలేదని.. నోడేటా అవలేబుల్ అనేది ఎవరికి వర్తిస్తుందో ఆలోచించండి అంటూ కేసీఆర్ సర్కారుకు నిర్మలా సీతారామన్ చురకలంటించారు. కాగా, 2014లో తెలంగాణలో అప్పులు రూ. 60 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు మూడు లక్షల కోట్ల రూపాయలు దాటాయని ఆమె చెప్పారు. రాష్ట్రం చేయనంతగా తెలంగాణలో అప్పులు పెరిగాయని అంటూ కరోనా కారణంగా అందరం అప్పులు తెచ్చుకున్నామని.. ఇప్పుడు అప్పులు తీరుస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

 
అంతేగాక, రాష్ట్రాలు చేసే అప్పులను పరిశీలించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందని నిర్మలా సీతారమన్ స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగంలో పొందుపర్చిన నిబంధన అని, దాన్ని తాము అమలు చేస్తున్నామని ఆమె చెప్పారు. ఎప్ఆర్బీఎం లిమిట్ పైనా ఇప్పటికే అనేకసార్లు సమాధానం చెప్పానని ఆమె తెలిపారు. పార్లమెంట్ అనేది అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థ అని.. ఇక్కడే అనేకసార్లు సమాధానం ఇచ్చినట్లు ఆమె తెలిపారు.
 
అందరినీ ఒకేలా చూస్తామని.. సంక్షేమ పథకాలు అందరికీ అందజేస్తామని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు. పథకాలను జోక్ అంటూ ప్రజలను వెక్కిరిస్తున్నారా? అని కేసీఆర్‌పై నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల కోసం ఉచిత రేషన్ ఇవ్వడాన్ని ఎగతాళి చేస్తారా? అని ఆమె నిలదీశారు.  చాలా రాష్ట్రాలు తమతో కలిసి వస్తామని అంటున్నాయని, అయితే కేసీఆర్ మాత్రం వెక్కిరిస్తున్నారని అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.