పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఆరోపణల పట్ల ఓం బిర్లా ఆందోళన

పార్లమెంట్‌, పలు రాష్ట్రాల అసెంబ్లీలో ఇటీవల జరిగిన గందరగోళం జరుగడంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్‌ శాసనసభ సభ్యుల రెండురోజుల ఓరింయంటేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ నినాదాలు చేయడం ద్వారా నేతలు తయారుకారని, కేవలం చర్చల ద్వారా మాత్రమే సాధ్యమని స్పష్టం చేశారు.

పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీల్లో జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల ‘కొత్త సంప్రదాయం’ దేశ ప్రజాస్వామ్యానికి సరికాదని స్పష్టం చేసారు. ప్రజాస్వామ్యాన్ని చైతన్యవంతం చేసేందుకు సభల్లో నిర్మాణాత్మక చర్చలు జరుగాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది ‘శుద్ధి యాగం’లాంటిదన్న ఆయన.. అవసరమైన చోట ప్రతిపక్షాలు ప్రభుత్వ విధానాలను విమర్శించడంతో పాటు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని సూచించారు.

దీనికి బదులుగా ఆరోపణలు, ప్రత్యారోపణల కొత్త సంప్రదాయం కనిపిస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో గవర్నర్‌, రాష్ట్రపతి ప్రసంగానికి అంతరాయం కలిగించడం మంచి పద్ధతి కాదని హితవు చెప్పారు.  గర్నవర్‌, రాష్ట్రపతి రాజ్యాంగపరంగా ఉన్నతమైన వ్యక్తులని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా మనం సంప్రదాయం పాటించాలని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యం సజీవంగా ఉండాలంటే చర్చలు జరుగాలని, చట్టాల రూపకల్పనలో పాల్గొనాలని ఓం బిర్లా హితవు చెప్పారు. చట్టాలను రూపొందించే సమయంలో నిపుణుల నుంచి విభిన్న సలహాలు సూచనలు తీసుకోవాలని సూచించారు.  కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు చర్చలపై అధ్యయనం చేసి, దాని నుంచి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు.