ఢిల్లీ లిక్కర్ స్కాంలో బెయిల్ నిరాకరణ

ఢిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్‌ వ్యవహారంలో నిందితుల బెయిల్‌ పిటిషన్లను రౌస్‌ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించిన నిందితులకు బెయిల్ నిరాకరించింది. నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ నాగ్ పాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
 
. మద్యం పాలసీ రూపకల్పనలో ఢిల్లీ సర్కార్ కు రూ.100 కోట్ల ముడుపులు ముట్టాయన్న ఆరోపణలతో ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. లిక్కర్ కేసుకు సంబంధించి సౌత్ గ్రూపులో కీలకంగా వ్యవహరించిన శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, బినోయి బాబు, విజయ్ నాయర్ లు బెయిల్ కోసం రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దర్యాప్తునకు సహకరిస్తున్నందున బెయిల్ ఇవ్వాలని కోరారు
 
ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని, బెయిల్‌ ఇవ్వొద్దని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వాదనలు వినిపించింది. తాజాగా సౌత్‌ గ్రూప్‌ నుంచి మాగుంట రాఘవ, గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేశామని.. వీరిచ్చిన సమాచారం ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని ఈడీ వివరించింది.  ఈడీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కేసు దర్యాప్తులో ఉన్నందున నిందితులకు బెయిల్ ఇవ్వద్దని ధర్మాసనాన్ని కోరారు.
సౌత్ గ్రూపులోని నిందితులు బయటకు వెళ్తే సాక్ష్యులతో పాటు కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముందని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నిందితులకు బెయిల్ నిరాకరించారు. నిందితులంతా 3 నెలలుగా తీహార్ జైలులో ఉన్నారు. కోర్టు తీర్పుతో ఇప్పట్లో వారు బయటకు వచ్చే అవకాశం లేదు.
 
 ఈ  కేసులో ఈడీ రెండో ఛార్జ్ షీట్ లో కీలక వ్యక్తుల పేర్లు పేర్కొంది. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వైసిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లు ఛార్జ్ షీట్ లో ఈడీ పేర్కొంది. అలాగే అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా, విజయ్ నాయర్, బినోయ్ బాబు సహా మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది.
 
ఈ మద్యం కుంభకోణం నుంచి వచ్చిన డబ్బును ఆప్ గోవాలో ఎన్నికల ప్రచారానికి వాడారని ఈడీ పేర్కొంది. ఇక సాక్ష్యాలు ధ్వంసం చేసిన వారి పేరులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. అలాగే విచారించిన జాబితాలో కవిత పేరును ఈడీ పేర్కొంది.