జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్!

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఉత్పత్తులను వస్తు సేవల పన్ను పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించాయిరు. అయితే, అందుకు రాష్ట్రాలు తప్పనిసరిగా అంగీకరించాలని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రాలు అంగీకరించిన వెంటనే పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారు.

వార్షిక బడ్జెట్ 2023-24 ప్రవేశపెట్టిన అనంతరం బుధవారం పారిశ్రామిక సమాఖ్య సభ్యులతో సమావేశమైన సందర్భంగా ఆమె ఈ ప్రకటన చేశారున. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక ఏకీకరణ చేసేందుకు అనుగుణంగా ఉందని ఆమె చెప్పారు. మోదీ ప్రభుత్వం గత మూడు నాలుగేళ్లుగా దేశాభివృద్ధి కోసం ప్రభుత్వ వ్యయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీతారామన్ చెప్పారు. బడ్జెట్‌లో మూలధన వ్యయాన్ని 33 శాతం పెంచి రూ.10 లక్షల కోట్లకు చేర్చామని ఆమె చెప్పారు.

‘గడిచిన మూడు నాలుగేళ్లుగా నిరంతరం ప్రభుత్వ మూల ధన వ్యయానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. మేము దానిని బడ్జెట్‌లోనూ స్పష్టంగా చెప్పాం. మూలధన వ్యయం పెంచడం అనేది ఈ బడ్జెట్ నిజమైన దృష్టిగా చెప్పవచ్చు. ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు మేం యాంకర్ పాత్ర పోషిస్తున్నాం. అందుకు వీలుగా పబ్లిక్ క్యాపెక్స్ ఎలివేటెడ్ వేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాం’ అని ఆమె తెలిపారు.

సిమెంట్‌ ధరలు తగ్గించే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 18న జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. “జీఎస్‌టీ కౌన్సిల్ ఈనెల 18న సమావేశమవుతోంది. ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో సిమెంట్ ధరలు తగ్గింపుపై నిర్ణయం తీసుకునేందుకు జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశమవుతోందని జీబీఐసీ చైర్మన్ వివేక్ జోహ్రి గత వారం తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ క్యాపెక్స్ ప్రయత్నంలో రాష్ట్రాలు ఒక భాగమని పేర్కొంటూ అందుకే వచ్చే ఆర్థిక ఏడాది 2023-24 బడ్జెట్‌లో రాష్ట్రాలకు రూ.1.3 ట్రిలియన్లు కేటాయించామని ఆర్ధిక మంత్రి తెలిపారు.  విద్యుత్తు రంగంతో పాటు వివిధ రంగాల్లో సంస్కరణలు చేపట్టాలని, ఒకే దేశం, ఒకే రేషన్ కార్డ్ అమలు చేయాలని  నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలిపారు.

కాగా, పెట్రోల్, డీజిల్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని నాలుగు నెలల క్రితమే పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ వెల్లడించాయిరు. అయితే, అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకారం తెలపాలని, లేకపోతే వీలు కాదని పేర్కొన్నారు. రాష్ట్రాలు అందుకు అంగీకరిస్తాయని అనుకోవడం లేదని చెప్పారు.

 రాష్ట్రాలు, ప్రధానంగా లిక్కర్‌, పెట్రోలియంను ఆదాయ వనరులుగా చూస్తున్నాయని, అటువంటి వాటిని వదులుకునేందుకు సిద్ధంగా ఉండకపోవచ్చని ఆయన వివరించారు.  పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాలను వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తేవాలంటే రాష్ట్రాలు అంగీకరించాల్సి ఉంటుంది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అంగీకరిస్తే పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తామని గతంలో పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ పేర్కొనగా.. తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం అదే ప్రకటన చేశారు.