చైనా బెలూన్ల కలవరం.. ఏం చేసేందుకైనా సిద్ధమన్న ప్రధాని రిషి

అమెరికాలో కలకలం రేపుతున్న చైనా నిఘా బెలూన్లు బ్రిటన్‌ను కూడా టార్గెట్ చేయవచ్చన్న వార్తల నడుమ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌ను సురక్షితంగా ఉంచేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమని ఆయన హెచ్చరించారు. అమెరికా గగనతలంలో నాలుగో గుర్తుతెలియని వస్తువును కూల్చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చిన కొద్ది గంటలకే రిషి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

‘దేశాన్ని భద్రంగా రక్షించుకునేందుకు ఎటువంటి చర్యలకైనా వెనుకాడబోము. మా గగనతలంలో అనుమానాస్పద వస్తువులను యుద్ధ విమానాలతో కూల్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మా దేశ గగనతలాన్ని కాపాడుకునేందుకు టైఫూన్‌ యుద్ధ విమానాలను అప్రమత్తంగా ఉంచాం. అట్లాంటిక్‌ మిత్ర దేశాలతో నిత్యం టచ్‌లో ఉంటూ.. రక్షణపరంగా నన్నద్ధతతో ఉన్నాం’ అని రిషి సునాక్‌ వెల్లడించారు.

అమెరికా ఇప్పటివరకు తన గగనతలంలో అనుమానాస్పదంగా ఉన్న నాలుగు వస్తువులను కూల్చేసింది. అయితే.. మొదట కూల్చేసిన బెలూన్ అత్యాధునికమైన నిఘా బెలూన్ అని, దాన్ని చైనాయే ప్రయోగించిందని ప్రకటించింది. కాగా, భారత్‌, బ్రిటన్‌, కెనెడా సహా 40 దేశాలపై నిఘా పెట్టేందుకు చైనా బెలూన్లను ప్రయోగిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ స్పందించారు.

ఇక బ్రిటన్‌ గగనతలంలో అనుమానాస్పద వస్తువులను యుద్ధ విమానాలతో కూల్చేందుకు తాము సిద్ధమేనని ప్రధాని రిషి సునాక్ తెలిపారు. ‘‘అత్యవసర సమాయాల్లో వేగంగా స్పందించేందుకు క్విక్ యాక్షన్ రెన్సాన్స్ ఫోర్స్ సిద్ధం చేశాం’’ అని ఆయన ప్రకటించారు.  కాగా, రెండు రోజుల క్రితం కెనడా గగనతలంపై చక్కర్లు కొడుతున్న అనుమానాస్పద వస్తువును అమెరికా ఫైటర్‌ జెట్‌ కూల్చివేసిన విషయం తెలిసిందే.

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో ఆదేశాల మేరకు అమెరికా, కెనెడియన్‌ వాయుసేనలు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో యూకాన్‌ వద్ద అమెరికన్‌ యుద్ధవిమానం ఎఫ్‌-22 దానిని పేల్చివేసింది. అనుమానాస్పద వస్తువు శిథిలాలు యూకాన్‌లో పడ్డాయని.. వాటిని పరిశీలించనున్నామని ట్రుడో ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. గత శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం) అమెరికాలోని అల‌స్కా వ‌ద్ద 40 వేల ఫీట్ల ఎత్తులో చ‌క్కర్లు కొడుతున్న ఓ గుర్తు తెలియ‌ని వ‌స్తువును ఆ దేశ యుద్ధ విమానాలు పేల్చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల క్రిత‌మే చైనాకు చెందిన నిఘా బెలూన్‌ను కూడా అమెరికా విమానాలు కూల్చేశాయి.