ఎల్‌టిటిఇ ప్రభాకరన్ బతికే ఉన్నారా!

లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్‌టిటిఇ) అధినాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారని, ఆయన సమ్మతితోనే తాను ఈ ప్రకటన చేస్తున్నానని ప్రపంచ తమిళ ఫెడరేషన్‌ అధ్యక్షుడు పళా నెడుమారన్ సోమవారం వెల్లడించారు. 2009లో శ్రీలంక అంతర్యుద్ధం చివరి దశలో ప్రభాకరన్‌ను శ్రీలంక సైన్యం హతమార్చింది. 

పళ నెడుమారన్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, ఇందిరాగాంధీ మాజీ సహాయకుడు. తమిళనాడులోని తంజావూరులోని ముల్లివైక్కల్ ముత్రంలో సోమవారం మీడియా సమావేశంలో నెడుమారన్ మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. అంతేగాక, తమిళుల స్వాతంత్య్రం కోసం ప్రభాకరన్‌ ఒక ప్రకటన చేయబోతున్నారని కూడా నెడుమారెన్‌ చెప్పారు. ప్రపంచంలోని తమిళ ప్రజలంతా కలిసికట్టుగా ప్రభాకరన్‌కు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

 ప్రభాకరన్ మృతదేహాన్ని ఎల్‌టిటిఇ మాజీ నాయకుడు కరుణ అమ్మన్ కూడా అప్పట్లో గుర్తించారు. కాగా..ప్రభాకరన్ ఇప్పటికీ సజీవంగానే ఉన్నారని, ఆయన కుటుంబ సభ్యులు తనకు అందుబాటులో ఉన్నారని నెడుమారన్ ప్రకటించారు. అయితే..నెడుమారన్ వాదనను శ్రీలంక ప్రజలతోసహా ఎవరూ విశ్వసించే పరిస్థితి లేదు.

2009 మే 19న ఉత్తర శ్రీలంకలోని ముల్లివయకల్ అడవుల్లో ప్రభాకరన్ మృతదేహం ఫోటోలను శ్రీలంక సైన్యం మీడియాకు విడుదల చేసింది. ప్రభాకరన్ శ్రీలంక నుంచి పారిపోయాడన్న వదంతులు రాకుండా ఉండేందుకే ఆయన మృతదేహం ఫోటోలను శ్రీలంక సైన్యం ముందుజాగ్రత్తగా విడుదల చేసింది. 

ప్రభాకరన్‌కు ఒకప్పుడు కుడిభుజంగా వ్యవహరించి ఆ తర్వాత ఆయనతో విభేదించి వేరుపడిన కరుణ అమ్మన్‌తోనే ఆ ఫోటోలను శ్రీలంక సైన్యం ధ్రువీకరింపచేసింది. కరుణ అమ్మన్ అనంతర కాలంలో మహీంద్ర రాజపక్స ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. డిఎన్ఎ పరీక్షలతో సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది.

అయితే, ప్రభాకరన్ సజీవంగా, సురక్షితంగా, మంచి ఆరోగ్యంతో ఉన్నారని పళ నెడుమారన్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రభాకరన్ ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని ఆయన బయట పెట్టలేదు. త్వరలోనే ప్రభాకరన్ జనం ముందుకు వస్తారని మాత్రం వెల్లడించారు.

ప్రభాకరన్ కుటుంబం కూడా సురక్షితంగా ఉందని, తాను వారితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు.  ప్రభాకరన్ సరైన సమయంలో జనం ముందుకు వస్తారని, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారనేది చెప్పడం కష్టమని చెప్పారు.

ఇలా ఉండగా, ప్రభాకరన్ బ్రతికి ఉన్నారన్న ప్రకటనను శ్రీలంక ప్రభుత్వం కొట్టివేసింది. అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలేవీ లేవని స్పష్టం చేసింది. ప్రభాకరన్ మరణించినట్టు ధ్రువీకరించే డీఎన్ఏ సర్టిఫికెట్స్‌తో సహా అన్ని ఆధారాలు శ్రీలంక వద్ద ఉన్నాయని శ్రీలంక డైరెక్టర్ మీడియా అండ్ ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ రవి హెరత్  మీడియాకు తెలిపారు.