కాశ్మీర్, హిమాచల్ లలో హిమపాతంతో స్తంభించిన రవాణా

ఉత్తర భారతాన్ని మంచు దుప్పటి కప్పేయడంతో హిమపాతంతో అక్కడి పరిసరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. పెద్ద ఎత్తున మంచు కురుస్తుండటంతో ఆయా ప్రాంతాలు మంచు ఖండాలను తలపిస్తున్నాయి. మరోవైపు హిమపాతం కారణంగా జనజీవనం స్తంభించింది. భారీ హిమపాతం కారణంగా శ్రీనగర్‌-జమ్మూ మధ్య రోడ్డు రవాణా స్తంభించింది.
 
విమాన సర్వీసులపై కూడా దీని ప్రభావం పడింది. 270 కిలో మీటర్ల జమ్మూ శ్రీనగర్‌ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడుతుండటంతో ఆ మార్గాన్ని అధికారులు మూసివేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్డుపై పెద్ద ఎత్తున పేరుకుపోయిన మంచును అధికార సిబ్బంది తొలగించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.
 
కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు వెయ్యి వాహనాలు మంచులో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. మంచులో చిక్కుకుపోయిన వారికి ఆహారం, మంచినీటి వసతి కల్పించినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది.  మరోవైపు హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ భారీగా మంచు కురుస్తోంది. చాలా జిల్లాల్లో హిమపాతం కొనసాగుతోంది. పర్యాటక ప్రాంతాలన్నీ సందర్శకులతో కేరింతలు కొడుతున్నాయి.
హిమపాతం కారణంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో రెండు జాతీయ రహదారులతో సహా 216 రహదారులను మూసేశారు.  అత్యధికంగా శిమ్లా పరిధిలోని కోతి ప్రాంతంలో 20 సెంటీమీటర్ల మేర మంచు కురిసినట్లు వాతావరణశాఖ తెలిపింది. హిమాచల్‌లోని కీలాంగ్‌ ప్రాంతంలో అత్యల్పంగా మైనస్‌ 4.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు