హరియాణా ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులకు డ్రెస్‌ కోడ్‌!

హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి నూతన డ్రెస్‌ కోడ్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులకు, సిబ్బందికి ప్రత్యేక యూనిఫాం వేసుకోవాలని ఆదేశించింది. స్పెషల్ డ్రెస్ కోడ్.. రోగులకు, సిబ్బంది, వైద్యుల మధ్య తేడాను గుర్తించడాన్ని సులభతరం చేస్తుందని స్పష్టం చేసింది.
 
ప్రభుత్వ ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది పనివేళల్లో ఫంకీ హెయిర్‌స్టైల్‌, నగలు, మేకప్‌, పొడవాటి గోళ్లు, స్కర్టులు ధరించకూడదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్‌ విజ్‌ వెల్లడించారు.  టీ-షర్ట్స్‌, జీన్స్‌లు, లెదర్‌ ప్యాంట్లు, క్రాప్‌టాప్స్‌, స్లీవ్‌ డ్రెస్‌ వంటి దుస్తులు వేసుకుని డ్యూటీకి వస్తే అనుమతించబోమని స్పష్టం చేశారు.
 
వైద్యులు ఎవరూ చెమట కనిపించే చొక్కాలు, డెనిమ్ స్కర్టులు, షార్ట్‌లు, స్ట్రెచబుల్ టీ-షర్టులు లేదా ప్యాంట్‌లు, బాడీ హగ్గింగ్ ప్యాంట్‌లు, నడుము వరకు ఉండే టాప్‌లు, స్ట్రాప్‌లెస్ టాప్‌లు, బ్యాక్‌లెస్ టాప్‌లు, క్రాప్ టాప్‌లు, డీప్-నెక్ టాప్‌లు, ఆఫ్-షోల్డర్ బ్లౌజ్‌లు, స్నీకర్లను కూడా ధరించకూడదని ఆదేశించింది.
 
మహిళా వైద్యులు మేకప్ వేసుకోవడాన్ని, బరువైన ఆభరణాలు ధరించడంతో పాటు, తమ గోళ్లను పొడవుగా పెంచడాన్ని కూడా బ్యాన్ చేసింది. పురుషులు తమ జుట్టును షర్ట్ కాలర్ కంటే పొడవుగా పెంచవద్దని సూచించింది.   ఫార్మల్‌ దుస్తులను మాత్రమే ధరించాలని సూచించారు.  ఉద్యోగుల్లో క్రమశిక్షణ, ఏకత్వం, సమానత్వం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ డ్రెస్‌ కోడ్‌ను అమల్లోకి తెచ్చినట్లు అనిల్‌ విజ్‌ తెలిపారు.
 
ఈ డ్రెస్‌ కోడ్‌ను సిబ్బంది తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. వారాంతాలు, నైట్‌ షిఫ్టుల్లో ఉన్న సిబ్బంది కూడా ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.