బియ్యం ఆహార భద్రతకు ఆధారం, ఆర్థిక వ్యవస్థకు మూలం

భారతదేశంలో ఆహార భద్రతకు బియ్యం ఆధారమని, మన ఆర్థిక వ్యవస్థకు కూడా బియ్యం ప్రధాన అంశమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. రెండవ ఇండియన్ రైస్ కాంగ్రెస్-2023ను కటక్ లో ప్రారంభిస్తూ నేడు భారతదేశం బియ్యం ప్రముఖ వినియోగదారు, ఎగుమతిదారుగా ఉందని, ఇందుకు చాలా ఘనత  నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు చెందుతుందని కొనియాడారు. 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, పరిస్థితి భిన్నంగా ఉండేదని, ఆ రోజుల్లో మన ఆహార అవసరాలను తీర్చలేక, దిగుమతులపై ఆధారపడేవాళ్లమని ఆమె గుర్తు చేశారు. గత శతాబ్దంలో నీటి పారుదల సౌకర్యాలు విస్తరించడంతో, కొత్త ప్రదేశాలలో బియ్యం ఉత్పత్తి అవుతున్నాయని, కొత్త వినియోగదారులను కనుగొన్నాయని రాష్ట్రపతి చెప్పారు.

అయితే, వరి పంటకు పెద్ద మొత్తంలో నీరు అవసరం కాగా, వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయనీ, కరువులు, వరదలు, తుఫాన్ లు తరచుగా సంభవిస్తుండటంతో వరిసాగు  దుర్లభంగా మారిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. కొత్త భూముల్లో వరిని పండిస్తున్నప్పటికీ కొన్ని చోట్ల సంప్రదాయ వంగడాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ఆమె తెలిపారు.

‘‘ఈ రోజు మనం ఒక మధ్య మార్గాన్ని కనుగొనాలి, ఒక వైపు సాంప్రదాయ రకాలను పరిరక్షించాలి, మరోవైపు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలి. మితిమీరిన రసాయనిక ఎరువుల వాడకం నుంచి మట్టిని కాపాడుకోవాల్సిన సవాలు కూడా ఉంది, నేల ఆరోగ్యంగా ఉండాలంటే అలాంటి ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించాలి‘‘ అని రాష్ట్రపతి ఉద్భోదించారు.

పర్యావరణ అనుకూల వరి ఉత్పత్తి వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. మన ఆహార భద్రతకు బియ్యం ఆధారమని, కాబట్టి దాని పోషక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు. తక్కువ-ఆదాయ సమూహాలలో ఎక్కువ భాగం బియ్యంపై ఆధారపడుతుందని చెబుతూ ఇది తరచుగా వారి రోజువారీ పోషణకు ఏకైక వనరని ఆమె గుర్తు చేశారు.

కాబట్టి బియ్యం ద్వారా ప్రోటీన్, విటమిన్లు, అవసరమైన సూక్ష్మపోషకాలను అందించడం పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుందని ద్రౌపది ముర్ము చెప్పారు. ఎన్ఆర్ఆర్ఐ ద్వారా దేశంలోనే మొట్టమొదటి అధిక ప్రోటీన్ బియ్యం అభివృద్ధి గురించి ఆమె మాట్లాడుతూ, ఇటువంటి బయో-ఫోర్టిఫైడ్ రకాల అభివృద్ధి ఆదర్శనీయమని, దేశంలోని శాస్త్రీయ సమాజం ఈ సవాలును ఎదుర్కోగలదని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, భారతదేశం వ్యవసాయ దేశమని, అందువల్ల ప్రభుత్వం వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

‘‘మన రైతుల కృషికి తోడుగా శాస్త్రీయ పరిశోధనలు జరగడంతో వ్యవసాయ రంగం ఎంతో పురోగతి సాధించింది. ఆహారధాన్యాల విషయంలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ప్రపంచానికి సాయం చేసే దేశాల్లో ఒకటిగా నిలవడం మనకు గర్వకారణం. దేశంలో ఏ చిన్నారి లేదా వ్యక్తి పోషకాహార లోపంతో బాధపడకూడదన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం” అని ఆయన చెప్పారు.

పౌష్టికాహార లోపం సమస్యను పరిష్కరించడానికి, పోషక విలువలను పెంచడానికి బయోఫోర్టిఫైడ్ వరి వంగడాలను ఉత్పత్తి చేయాలని చెబుతూ ఈ దిశగా చర్యలు చేపట్టిన సంస్థ సీఆర్ 310, 311, 315 అనే వంగడాలను అభివృద్ధి చేసిందని కేంద్ర మంత్రి అభినందించారు.  ఈ సంస్థ 160 రకాల వరి వంగడాలను అభివృద్ధి చేసిందని చెప్పారు.

2010లో దేశంలో వరి ఉత్పత్తి కేవలం 89 మిలియన్ టన్నులు మాత్రమే ఉందని, రైతులు, శాస్త్రవేత్తల కృషితో 2022 నాటికి 46 శాతం పెరిగి 130 మెట్రిక్ టన్నులకు చేరుకుందని తెలిపారు. బియ్యం ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని, ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉందని చెప్పారు.