మాగుంట రాఘవ రిమాండ్ రిపోర్ట్‌లో కవిత పేరు!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు తరచూ తెరపైకి వస్తున్నది. తాజాగా మరోసారి మాగుంట రాఘవ రిమాండ్ రిపోర్ట్‌లో  కవిత పేరును ఈడీ అధికారులు జతచేశారు. ఎమ్మెల్సీ  కవిత ప్రతినిధిగా అరుణ్‌ పిళ్లై వ్యవహరించారని ఈడీ అధికారులు పేర్కొన్నారు.

ఎన్రికా ఎంటర్‌ప్రైజెస్ పేరుతో మాగుంట రాఘవ లిక్కర్ తయారీ కార్యకలాపాలు సాగిస్తున్నారని ఈ రిపోర్ట్ పేర్కొంది. రాఘవ్ ఎన్రికా ఎంటర్‌ప్రైజెస్ ప్రధాన వాటాదారుడిగా రాఘవ ఉన్నారని.. తన తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ద్వారా రాఘవ ఈ భాగస్వామ్యాన్ని పొందారని తెలిపింది. అయితే.. ఢిల్లీ మద్యం వ్యాపార కార్యకలాపాలన్నీ రాఘవే నిర్వహించేవారని సంచలన విషయాలను వెల్లడించింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 8న  ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అంకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్ అయ్యారు. అయితే బుచ్చిబాబుకు ఢిల్లీ సీబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.  సీబీఐ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. బుచ్చిబాబును 14 రోజుల కస్టడీకి అప్పగించింది. మరోవైపు ఈ కేసులో ఈడీ అధికారులు శనివారం అరెస్ట్ చేసిన  ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను  అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో దర్యాప్తు చేసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 2022 డిసెంబర్ లో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవితను విచారించారు. 160 సీఆర్‌పీసీ చట్టం ప్రకారం కవితను సాక్షిగా విచారించారు. మద్యం కేసులో ఆమెపై అనేక  ప్రశ్నలు సంధించారు. కవిత వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. ఆ తర్వాత సిబిఐ, ఈడీ ఛార్జ్ షీట్ లలో కూడా ఆమె పేరు తెరపైకి వచ్చింది.

గోవా ఎన్నికల సందర్భంగా ఆప్ కు రూ 100 కోట్ల నగదును మద్యం లాబీ చేరవేయడంలో ఆమె కూడా ప్రధాన పాత్ర వహించినట్లు పేర్కొంటున్నారు. గతంలోనే 28 సార్లు కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సమయంలో.. కవిత, మాగుంట రాఘవ్‌, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, ఆడిటర్‌ బుచ్చిబాబు, పెర్నార్డ్‌ రికార్డ్‌కు చెందిన బినయ్‌ బాబు పలుమార్లు ఆప్‌ నేతలతో భేటీ అయ్యారని, హోల్‌సేల్‌, రిటైల్‌ ఉత్పత్తిదారులతో కుమ్మక్కై కార్టెల్‌(సిండికేట్‌)ను ఏర్పాటు చేశారని స్పష్టం చేసింది.

కవిత, మాగుంట రాఘవ్‌, శరత్‌రెడ్డి నిర్వహిస్తున్న సౌత్‌గ్రూప్.. ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిందని దినేశ్‌ అరోరా వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ పేర్కొంది. అరుణ్‌పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబులు సౌత్‌గ్రూ‌ప్ తరఫున ఢిల్లీలో ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపింది. . ఇండో స్పిరిట్‌ వ్యాపార వ్యవహారాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ప్రయోజనాలకు అరుణ్‌ పిళ్లై, మాగుంట ప్రయోజనాలకు ప్రేమ్‌ రాహుల్‌ మండూరి ప్రాతినిధ్యం వహించినట్లు ఈడీ ఆరోపించింది.