హైదరాబాద్ లో అట్టహాసంగా ఫార్ములా- ఈ ప్రపంచ రేసింగ్‌

హైదరాబాద్ లో అట్టహాసంగా హుస్సేన్‌సాగర్ తీరాన శనివారం ప్రతిష్ఠాత్మక ఫార్ములా- ఈ ప్రపంచ రేసింగ్‌ చాంపియన్‌షిప్‌ జరిగింది. ఫార్ములా-ఈ రేస్ వరల్డ్ చాంపియన్ గా జీన్ ఎరిక్ వెర్గ్ నే నిలిచాడు. రెండవ స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమి ఉన్నారు. ఈ విజయంతో జీన్ ఎరిక్ మూడుసార్లు ఫార్ములా-ఈ చాంపియన్ అయ్యాడు. భారత్‌లో తొలిసారి జరుగుతున్న రేసింగ్‌లో ప్రపంచస్థాయి రేసర్లు పాల్గొని అదరగొట్టారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు  ప్రారంభమైన రేసు గంటన్నర పాటు కొనసాగింది.  

రేసింగ్ లో తొలిసారి ప్రవేశపెట్టిన అత్యాధునిక జెన్‌3 కార్లతో రేసర్లు దుమ్ములేపారు. 2.8 కిలోమీటర్ల ట్రాక్ పై 11 జట్లు, 22మంది రేసర్లు 322 కిలోమీటర్ల వేగంతో కార్లను పరుగులు పెట్టించారు. 2013లో భారత్ లో  ఫార్ములా-1 రేస్ జరిగింది. ఈ రేసులో ఎలక్ట్రిక్‌ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీపడ్డాయి. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసుర్లు దూసుకెళ్లాయి.

అయితే, మొదటిసారి జరుగుతున్న ఈ రేసింగ్ కు హైదరాబాద్ వేదికవ్వడం విశేషం. దీంతో ఫార్ములా ఈ రేసుకు అతిథ్యమిచ్చిన 27వ నగరంగా హైదరాబాద్ నిలిచింది.  భారత్‌ నుంచి మహీంద్ర రేసింగ్‌, టీసీఎస్‌ జాగ్వార్‌ బరిలోకి దిగారు.

ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, మింట్ కాంపౌండ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, తెలుగుతల్లి పరిసర ప్రాంతాలు మూసివేశారు. రేసింగ్ చూసేందుకు 21వేల మందికి సీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ రేసింగ్‌ను తిలకించేందుకు సినీ, క్రికెట్ తారలు, మంత్రులు కేటీఆర్, పువ్వాడ, హీరో రామ్‌చరణ్‌, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, శికర్ ధావన్, దీపక్ హూడ, చాహల్.. అలాగే ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్‌ నాయుడు తదితరులు వచ్చారు.

రేసింగ్తో హైదరాబాద్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్బంగా పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్ మాట్టాడుతూ ఈ ఈవెంట్తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చాలా పెరిగిందని, 30 వేల టిక్కెట్లు అమ్ముడు అయ్యాయన్నారు. నగరంలో 10 చోట్ల పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశామని అరవింద్కుమార్ వెల్లడించారు.

ఫార్ములా ఈ రేస్కు హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  మాట్లాడుతూ… ఇటువంటి కార్యక్రమాలతో దేశ బ్రాండింగ్ టూరిజం పెరుగుతోందని చెప్పారు. నాలుగైదేళ్లలో ఈ వెహికల్స్ వినియోగం పెరుగుతుందని, ఈవీ వాహనాల ఉత్పత్తి పెంచేందుకు భారత్ కృషి చేస్తోందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే అనేక దేశాలు గ్రీన్ ఎనర్జీకి షిఫ్ట్ అవుతున్నాయని వెల్లడించారు.

కాగా ఫార్ములాలో మొత్తం 16 రేసులు నిర్వహిస్తారు. ఒక్కో రేస్‌లో రేసర్‌ పొందిన పాయింట్ల వారీగా సీజన్ల వారీ పాయింట్లు కలిపి, చివరకు ప్రపంచ చాంపియన్‌ను ప్రకటిస్తారు. పెట్రోల్‌ వంటి శిలాజ ఇంధనాలు కాకుండా కరెంటుతో నడిచే ఎలక్ట్రిక్‌ వాహనాలతో రేస్‌ చేయడమే ‘ఫార్ములా ఈ’ రేసింగ్‌ ప్రత్యేకత. ఎలక్ట్రిక్‌ కార్ల ద్వారా సుస్థిర రవాణాను ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశం.

2014లో బీజింగ్‌లో ఈ రేస్‌ ప్రారంభం కాగా చివరిసారి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగింది. ఇవాళ హైదరాబాద్‌లో రేసు జరిగింది.  ఆ తర్వాత దక్షిణ ఆఫ్రికాలోని కేప్‌ టౌన్‌లోజరుగనుంది.