ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం

దేశంలో శాంతి భద్రతల విషయంలో రాజీపడే ‍ ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. గత ఎనిమిదేళ్లలో వామపక్ష తీవ్రవాదాన్ని అడ్డుకోవడంతో పాటు పీఎఫ్ఐ ఉగ్రవాద సంస్థను నిషేధించామని చెప్పారు. హైదబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో 74 వ బ్యాచ్‌  ఐపీఎస్‌ అధికారుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హాజరై ట్రైనీ ఐపీఎస్‌ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజాప్రతినిధులు ఐదేళ్లకోసారి ఎన్నికవుతారని కానీ  ఐపీఎస్‌లకు 30  నుంచి 35 ఏళ్ల పాటు అధికారం ఉంటుందని గుర్తు చేశారు. రాజ్యాంగం తమపై ఉంచిన బాధ్యతలను ప్రతీ ఐపీఎస్ గుర్తుంచుకుని ముందుకు సాగాలని సూచించారు.

ఈ బ్యాచ్‌లో అధికం శాతం టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళే ఉన్నారని పేర్కొంటూ రానున్న కాలంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అమిత్ షా చెప్పారు. 8 ఏళ్ల క్రితం దేశం అంతర్గత ఆందోళనలతో అట్టుడుకిందని,  కానీ నేడు ఆ పరిస్థితి లేదని అమిత్ షా పేర్కొన్నారు.

ఎన్డీఏ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి దేశంలో ఉగ్ర‌వాద ముప్పు త‌గ్గింద‌ని అమిత్ షా తెలిపారు. జ‌మ్ము క‌శ్మీర్ లో ఉగ్ర‌వాదం అదుపులోనే ఉంద‌ని, ఈశాన్య రాష్ట్రాల్లో చొర‌బాటులు చాలా వ‌ర‌కు త‌గ్గాయ‌ని అమిత్ షా వివ‌రించారు.
ఏడు  దశాబ్దాలుగా అంతర్గత భద్రత రంగంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని చెబుతూ ఈ పరిస్థితుల్లో 36 వేల మంది పోలీసులు అమరులయ్యారని చెప్పారు.
 
జమ్మూ కాశ్మీర్ తీవ్రవాదము, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంతో సహా ఎన్నో సమస్యలు ఉండేవని..  అలాంటి సమస్యలన్నింటిని పూర్తిగా కట్టడి చేశామని తెలిపారు.  ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ద్వారా పోలీస్ వ్యవస్థను పటిష్టం చేశామని చెబుతూ ఎన్ఐఏ, ఎన్‌సీబీ లాంటి సంస్థల్ని విస్తృతపరుస్తున్నామని తెలిపారు. టెర్రరిజం, డ్రగ్స్‌ లపై ఉక్కుపాదం మోపుతామని పేర్కొంటూ డ్రగ్స్ అక్రమ రవాణాలో బయట పడుతున్న ఉగ్రవాదంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఆర్థిక నేరాలకు కట్టడి చేస్తున్నామని చెబుతూ సైబర్ త్రెట్ పెనుసవాలుగా మారిందని తెలిపారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానంపై పని చేశామమని చెప్పారు. అదేవిధంగా 2005లో ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న దేశాన్ని 5వ స్థానంలోకి నిలబెట్టామన్న షా  త్వరితగతి దాన్ని కూడా అధిగమించి మూడవ స్థానాన్ని చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

‘దీక్షంత్ పరేడ్’లో 195 మంది ఆఫీసర్ ట్రైనీలు పాల్గొన్నారు, వీరిలో 166 మంది ఐపిఎస్ ఆఫీసర్లు, వివిధ దేశాల నుంచి 28 మంది ఆఫీసర్ ట్రైనీలు ఉన్నారు. ఆరుగురు భూటానీలు, ఎనిమిది మంది మాల్దీవియన్లు, ఐదుగురు నేపాలీలు, పది మంది మారిషస్ పోలీస్ అధికారులు విదేశీ శిక్షణ పొందిన వారిలో ఉన్నారు. నల్సార్‌తో ఎస్‌విపిఎన్‌పిఎ మెమోరాండం ఆఫ్ అందర్సాండింగ్‌లో భాగంగా ఆఫీసర్ ట్రైనీలు మొదటిసారిగా పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీలను పొందుతారు, ఇతర దేశాల నుండి ఆఫీసర్ ట్రైనీలుగా శిక్షణ పూర్తి చేసుకున్నవారు డిప్లొమా సర్టిఫికేట్లు పొందుతారు.