జమ్మూ కాశ్మీర్‌ లో భారీగా లిథియం నిల్వలు

దేశంలో తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌ లో లిథియం నిల్వలను కనుక్కున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్‌ లోని రియాసి జిల్లాలోని సలాల్‌-హైమానా ప్రాంతంలో 5.9 మిలియన్‌ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు గనుల మంత్రిత్వ శాఖ తెలిపింది.  లిథియం ఎలక్ట్రానిక్ వాహనాల బ్యాటరీలు, ఇతర విద్యుత్ పరికరాల తయారీలో కీలకమైనది. 

కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా దేశీయంగా విద్యుత్ వాహనాల తయారీని ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా విద్యుత్ వాహనాల ధరలు తక్కువగా ఉండేందుకు పలు పన్ను ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రస్తుతం మన దేశం లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి లోహాలను దిగుమతి చేసుకొంటోంది.

తాజాగా జమ్మూ, కశ్మీర్‌లో లిథియం నిల్వలను కనుగొనడంతో భవిష్యత్తులో విద్యుత్ వాహన తయారీ రంగానికి మరింత బలం చేకూరనుంది. ఈ వాహనాల బ్యాటరీల తయారీలో లిథియం చాలా కీలక పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో దీని దిగుమతులు తగ్గే అవకాశం ఉంది.  అంతేకాకుండా బ్యాటరీల ధరలు కూడా దిగివచ్చే అవకాశం ఉంది.

జమ్మూ, కశ్మీర్‌లో లిథియం నిల్వలను కనుగొనడంపై కేంద్ర గనుల శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ మాట్లాడుతూ ‘స్వయం సమృద్ధి సాధించే దశలో విలువైన ఖనిజాలు కనుగొనడం, వాటిని ప్రాసెస్ చేయడం చాలా కీలకం’ అని పేర్కొన్నారు.

లిథియం కేవలం విద్యుత్ వాహనాలకే కాదు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డిజిటల్ కెమెరాలు లాంటి వాటి తయారీలోను కీలకపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల తయారీపై కేంద్రం దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. అత్యాధునిక స్మార్ట్‌ఫోన్లలో ప్రస్తుతం లిథియం అయాన్ బ్యాటరీలనే ఉపయోగిస్తున్నారు. లిథియం ధరలు తగ్గే కొద్దీ స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా తగ్గుతాయి.

లిథియంతో పాటు బంగారానికి సంబంధించి 51 మినరల్‌ బ్లాకులను ఆయా రాష్ట్రప్రభుత్వాలకు అప్పగించింది. ఇందులో 5 బ్లాక్‌ లు బంగారానికి సంబంధించినవి కాగా.. పొటాష్‌, మాలిబ్డినం, బేస్‌ మెటల్స్‌ మొదలైన ఖనిజాల బ్లాకులు ఉన్నాయని తెలిపింది.

ఇవి జమ్మూ కాశ్మీర్‌ తో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, జార్ఖండ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఒడిస్సా, రాజస్తాన్‌, తమిళనాడు, తెలంగాణ మొత్తం 11 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సర్వే ఆధారంగా 2018-19 ఫీల్డ్‌ సీజన్‌ నుంచి ఈ బ్లాకులను ఏర్పాటు చేసింది. వీటిలో 17 చోట్ల 7897 మిలియన్ టన్నుల బొగ్గు, లిగ్నైట్ ఉన్న గనులను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు అప్పగించారు.

రైల్వేలకు బొగ్గు నిక్షేపాలను వెలికి తీయాలని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జిఎస్ ఐ)ని 1851లో స్థాపించారు. అనంతరం జి ఎస్ ఐ  భౌగోళిక శాస్త్రం, ఖనిజాల పరిశోదన, భూకంపాలు ఇలా పలు రంగాలపై అధ్యయనం చేస్తోంది.  జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వ్యూహాత్మక, కీలకమైన ఖనిజాలపై 115 ప్రాజెక్టులు, ఎరువుల ఖనిజాలపై 16 ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది.

2023-24 ఏడాదిలో 12 సముద్ర ఖనిజ పరిశోధన ప్రాజెక్టులతో సహా 318 ఖనిజ అన్వేషణ ప్రాజెక్టులతో కూడిన 966 కార్యక్రమాలను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా చేపడుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. జియోఇన్ఫర్మేటిక్స్‌పై 55 ప్రోగ్రామ్‌లు, ఫండమెంటల్‌ అండ్‌ మల్టీడిసిప్లినరీ జియోసైన్స్‌లపై 140 ప్రోగ్రామ్‌లను, శిక్షణ, సంస్థాగత సామర్థ్యం పెంపు కోసం 155 ప్రోగ్రామ్స్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది