మద్దతు కోసం ఐరోపాలో జెలెన్‌స్కీ సుడిగాలి పర్యటన

తమ దేశంపై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి సంవత్సరం అవుతున్న సందర్భంగా  సమర్ధంగా ఎదుర్కొనేందుకు మద్దతు, అదనపు సైనిక సహాయం కోరుతూ  ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ఐరోపాలో తొలిసారి సుడిగాలి పర్యటన జరిపారు. బుధవారం బ్రిటన్‌లో ఆకస్మికంగా పర్యటనకు వచ్చిన ఆయన అక్కడ రిషి సునక్‌, బ్రిటీష్‌ రాజు చార్లెస్‌తో భేటీ అయ్యారు. అనంతరం బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రసంగించారు.

అక్కడి నుంచి అర్ధరాత్రి సమయంలో ఆయన ఫ్రాన్స్‌ చేరుకున్నారు. అక్కడ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌, జర్మనీ ఛాన్సలర్‌ ఓలోఫ్‌ స్కోల్జ్‌లను కలిశారు. రష్యాకు గట్టి సవాల్ విసిరేందుకు వీలైనంత త్వరగా ఫైటర్ జెట్లను, భారీ ఆయుధాలను పంపాలని ఫ్రాన్స్, జర్మనీలను జెలెన్‌స్కీ కోరారు.

యూరోపియన్ యూనియన్ (ఇయూ)ను ఉద్దేశించి గురువారం మాట్లాడుతూ రష్యా పై పోరు కేవలం తమ దేశానిదే కాదని, ఇతరత్రా యూరప్ దేశాలు కూడా ఈ ఘర్షణలో పాలుపంచుకోవల్సి ఉంటుందని, కలిసికట్టుగా వ్యవహరించాల్సి ఉందని పిలుపు నిచ్చారు. రష్యా ప్రపంచంలోనే అతి తీవ్రమైన ఐరోపా వ్యతిరేక శక్తి అని తెలిపారు.

ఉక్రెయిన్ విజయం సాధించడంతోపాటు శాంతి కోసం, యూరప్ కోసం, ప్రజలు తమ హక్కులను పొందేందుకు తమ దేశం అండగా ఉంటుందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు సహాయం అందించడానికి తాము తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని చెప్పారు. ఉక్రెయిన్‌లో మొత్తం ఐరోపా భవిష్యత్‌ ప్రమాదంలో పడిందని ఆయన తెలిపారు. రష్యా గెలవదు, గెలవకూడదని మాక్రాన్‌ అభిప్రాయపడ్డారు.

మరోవైపు, జర్మన్ ఛాన్సలర్ స్కోల్జ్ మాట్లాడుతూ ఉక్రెయిన్, యూరోపియన్ కుటుంబంలో ఒక భాగమని పేర్కొన్నారు. జర్మనీ ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయంతో పాటు ఆయుధాలు, మానవతా సహాయం అందించిందని, ఉక్రెయిన్‌కు అవసరమైనంత వరకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.ఉక్రెయిన్‌కు లియోపార్డ్‌ ట్యాంకులను ఇవ్వనున్నట్లు జర్మనీ ప్రకటించింది.

మొదటి ట్యాంక్ బెటాలియన్ ఏప్రిల్ నాటికి ఉక్రెయిన్‌ నగరం కైవ్‌కు చేరుకుంటుందని జర్మనీ రక్షణ మంత్రి తెలిపారు. అమెరికా, బ్రిటన్ కూడా ఉక్రెయిన్‌కు పలు ట్యాంకులు, ఆయుధాలను పంపుతామని హామీ ఇచ్చాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన అనంతరం జెలెన్‌స్కీ తొలిసారి ఐరోపాలో పర్యటిస్తున్నాడు. బుధవారం బ్రిటిష్ పార్లమెంట్‌లో ప్రసంగించిన జెలెన్‌స్కీ.. బ్రిటన్ ప్రజలకు ఉక్రెయిన్ ‘వార్ హీరోస్’ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

ఇయూ పార్లమెంట్‌ లో ప్రసంగం తరువాత జెలెన్‌స్కీ ఇయూ జెండాను పట్టుకుని నిలబడ్డారు. ఈ దశలో మొత్తం పార్లమెంట్ మౌనంగా ఉండి, ఉక్రెయిన్‌కు సంఘీభావం ప్రకటించింది. ఈ దశలోనే ఉక్రెయిన్ జాతీయ గీతం ఆలాపన జరిగింది. ఇయూ ఎంపిలను ఉద్ధేశించి జెలెన్‌స్కీ చేసిన ప్రసంగానికి ముందు మధ్యమధ్యలో తర్వాత కూడా పలుసార్లు సభికుల నుంచి హర్షధ్వానాలు వెలువడ్డాయి.

తాము ఒక్కరిమే రష్యాతో పోరు చేయడం కత్తిమీద సాము అవుతుందని, ఇతర దేశాల నుంచి కూడా తగు సాయం అవసరం ఉంటుందని జెలెన్‌స్కీ తెలిపారు. ప్రత్యేకించి ఇతర దేశాల నుంచి తమకు సైనిక ఆయుధ సాయం అత్యవసరం అని, ఇది సకాలంలో తక్షణం స్పందించి చేయాల్సిన సాయం అని జెలెన్‌స్కీ తెలిపారు.

జెలెన్‌స్కీ మాట్లాడటానికి ముందు ఇయూ పార్లమెంట్ అధ్యక్షులు రాబెర్టా మెట్సోలా ప్రసంగీస్తూ మిత్రపక్షాలు తక్షణం ఉక్రెయిన్‌కు సాయం అందించే విషయంలో స్పందించాల్సి ఉందని కోరారు, ప్రత్యేకించి లాంగ్ రేంజ్ సిస్టమ్స్, ఫైటర్ జెట్స్ ఉక్రెయిన్‌కు సాయంగా పంపించాల్సి ఉందని పేర్కొన్నారు.

రష్యాకు తగు విధంగా జవాబు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ రష్యా అధ్యక్షులు పుతిన్ తరచూ వెలువరిస్తున్న యుద్ధ ప్రకటనలకు దీటుగా స్పందన ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ముప్పు ఇప్పటికీ పొంచి ఉందని, దీనికి అనుగుణంగానే అందరి స్పందన ఉండాలని సూచించారు.