భూకంపం ధాటికి ఆరు మీటర్ల మేర పక్కకు కదిలిన టర్కీ

టర్కీ భౌగోళికంగా భూకంప ప్రభావిత ప్రాంతాల కూడలిలో ఉంటుంది. ఇక గత సోమవారం సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం ధాటికి ఆ దేశం ఐదు నుంచి ఆరు మీటర్ల మేర పక్కకు కదిలినట్లు ఇటలీకి చెందిన సీస్మాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ కార్లో డగ్లియాని వెల్లడించారు.

టర్కీ ఉన్న టెక్టానిక్‌ ప్లేట్స్‌ (భూమి పైపొరలోని ఫలకాలు) మధ్య రాపిడి కారణంగా ఈ కదలిక జరిగినట్లు తెలిపారు. తమ అంచనా ప్రకారం ఈ భూకంప తీవ్రతతో సిరియాతో పోలిస్తే టర్కీ 5-6 మీటర్ల పక్కకు జరిగినట్లు వెల్లడించారు. టర్కీ భూభాగం కింద ఉన్న అనతోలియా, అరేబియా, యూరేసియా, ఆఫ్రికా భూఫలకాలు నిరంతరం ఒకదానితో ఒకటి ఢకొీనడంతో 7.8, 7.2 తీవ్రతతో వరుసగా రెండు సార్లు శక్తిమంతమైన భూకంపాలు సంభించినట్లు ఆయన తెలిపారు.

తాజాగా సంభవించిన భూకంపం టర్కీ కిందనే ఉన్న తూర్పు అనతోలియన్‌ ఫాల్ట్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. గతంలోనూ ఇదే ఫలకం రాపిడికి గురై ఇక్కడ భూకంపాలు సంభవించాయి. ఇక, తాజా భూకంప కేంద్రం నేల నుంచి 18 కి.మీ లోతులోనే ఉంది. అందువల్లే పెను విధ్వంసాన్ని మిగిల్చింది. భూకంప కేంద్రం లోతు ఎంత ఎక్కువగా ఉంటే నష్టం అంత తక్కువగా ఉంటుంది.

పేకమేడల్లా కూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. దీంతో ఇప్పటివరకు 21 వేల మందికిపైగా మరణించారు. వేల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు తుర్కియే విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. భూకంపాల వంటి విపత్తులు జరిగినప్పుడు అత్యంత కీలకమైన 72 గంటల సమయం ఇప్పటికే ముగిసిపోయింది. దీంతో శిథిలాల కింద చిక్కున్నవారు బతకడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, టర్కీలో గడ్డకట్టే చలి, సిరియాలో అంతర్యుద్ధం కారణంగా సహాయ చర్యలకు ఆటంకం కలుగుతున్నది. భూకంపం దాటికి ధ్వంసమైన రోడ్లు, రన్‌వేల వల్ల కూడా ప్రజలకు వేగంగా సహాయం అందడం లేదు. భూకంపంతో కూలిన భవనాల శిథిలాల కింద ఉన్న వారిని తొలగించేందుకు రెస్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

ఇందుకోసం 1,10,000 మంది రెస్యూ సిబ్బంది పని చేస్తున్నారని, 5,500 వాహనాలు, క్రేన్లు, బుల్డోజర్లతో శిథిలాలు తొలగిస్తున్నట్టు తుర్కియే అధికారులు చెప్తున్నారు. అయితే, తమ వారిని కాపాడుకునేందుకు ప్రజలు కూడా బృందాలుగా ఏర్పడి శిథిలాలను తొలగిస్తున్నారు. కాగా, భూకంపంతో భారీ నష్టాన్ని చవిచూసిన తుర్కియే, సిరియాలకు అమెరికా, ప్రపంచ బ్యాంక్‌ ఆర్థికసాయం ప్రకటించాయి. అగ్రరాజ్యం అమెరికా రూ.700 కోట్లు, ప్రపంచ బ్యాంకు రూ.1.46 లక్షల కోట్ల సాయాన్ని అందించనున్నాయి.