వివేకానంద రాక్-తిరువళ్లువర్ విగ్రహం మధ్య ఫైబర్‏గ్లాస్ వంతెన

సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతం కన్నియాకుమారిలో స్వామి వివేకానంద స్మారక మండపం, 133 అడుగుల ఎత్తు తిరువళ్లువర్‌ విగ్రహం ప్రాంతాన్ని కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్‌ గ్లాస్‌ రహదారి వంతెన నిర్మించనుంది. రూ.37 కోట్లతో గుండ్రటి పైకప్పుతో కూడిన ఈ ఫైబర్‌ గ్లాస్‌ వంతెన రహదారి దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు మరొక అద్భుతమైన ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.
 
ఈ ఫైబర్‌గ్లాస్‌ వంతెన రహదారి నిర్మాణానికి ఇటీవలే రాష్ట్ర సముద్రతీర క్రమబద్దీకరణ ప్రాంతీయ మండలి అనుమతి కూడా మంజూరు చేసిందని పర్యాటక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన కన్నియాకుమారిలో పర్యాటకులు రోజూ సూరోదయ, సూర్యాస్తమ దృశ్యాలు, వివేకానంద స్మారక మండపం, 133 అడుగుల ఎత్తు తిరువళ్లువర్‌ విగ్రహం ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు.
 
ఆ మేరకు ప్రతిరోజూ త్రివేణి సంగమ ప్రాంతానికి యేడాదికి 80 లక్షల మంది చొప్పున పర్యాటకులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ఫైబర్‌ గ్లాస్‌ రహదారి వంతెన మీదుగా వివేకానంద స్మారక మండపం నుంచి తిరువళ్లువర్‌ విగ్రహం వరకు నడిచి వెళ్తూ మూడు సముద్రాల కలయిక, ప్రకృతి సౌందర్యాలను పర్యాటకులు వీక్షించటం మధురానుభూతి కలిగిస్తుందని అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా ఫైబర్‌ గ్లాస్‌ రహదారి వంతెన నిర్మాణపు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.