కేజ్రీవాల్ ప్రభుత్వ గూఢచర్యంకు బిజెపి నిరసన

ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం తమ నేతలపై గూఢచర్యం చేస్తున్నదని పలు నివేదికలు స్పష్టం చేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి వ్యతిరేకంగా బీజేపీ నిరసనకు దిగింది. గురువారం ఐటీఓ నుంచి సచివాలయం వరకు బీజేపీ నిరసన ప్రదర్శన చేపట్టింది. అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ నివాసం ఎదుట బైఠాయించారు.
 
సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, బీజేపీ నేతల ఆరోపణలను ఆప్‌ తీవ్రంగా ఖండించింది. సిసోడియాను ముద్దాయిగా నిలబెట్టాలని చూస్తున్నారని మండిపడింది.

వివిధ మీడియా నివేదికల ప్రకారం, 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఇతర పార్టీల నాయకులు, అధికారులపై నిఘా పెట్టింది. ఇందు కోసం ఫీడ్‌బ్యాక్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. 2016 లో విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఓ అధికారి ఫిర్యాదు మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. గత నెల 12న విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఒక నివేదికను సీబీఐ దాఖలు చేసింది.

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై కేసు నమోదు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కోరింది. తదుపరి దర్యాప్తు చేపట్టేందుకు అనుమతివ్వాలని కూడా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను సీబీఐ కోరింది. ఈ విషయాన్ని ఆయన రాష్ట్రపతికి నివేదించినట్లుగా తెలుస్తున్నది.

ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం తమ నేతలపై గూఢచర్యం చేస్తున్నదని, ఢిల్లీ ఫీడ్‌బ్యాక్ యూనిట్ గూఢచర్యం చేస్తున్నదని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల మాటలను ఆప్ రహస్యంగా వింటున్నదని ఆయన ఆరోపించారు. ఆప్ నాయకులు ఢిల్లీ కోసం పని చేయడం లేదు, కానీ ఢిల్లీ పన్ను చెల్లింపుదారుల డబ్బుతో అక్రమంగా గూఢచర్యం చేస్తున్నారని మండిపడ్డారు.

అయితే, బీజేపీ ఆరోపిస్తున్నట్లుగా మనీష్‌ సిసోడియా ఎలాంటి రాజకీయ గూఢచర్యానికి పాల్పడలేదని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొన్నది. వీరి ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, ఈ కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమని కేజ్రీవాల్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.