మహిళలు మసీదులో నమాజ్‌ కు అభ్యంతరం లేదు

ముస్లిం మహిళలు మసీదులో నమాజ్‌ చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు స్పష్టం చేసింది. అయితే, మహిళలు కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను సమర్పించింది. ఇదే కేసులో ఇంతకు ముందే ఒక అఫిడవిట్‌ను బోర్డు అందజేసింది. ఇది రెండో అఫిడవిట్‌. పర్సనల్‌ లా బోర్డు కేవలం ఇస్లాం సూత్రాలపై సలహాలు ఇచ్చే నిపుణుల సంఘం అని పేర్కొన్నది. తాము ఎలాంటి మత విశ్వాసాలపై వ్యాఖ్యానించదలుచుకోలేదని వెల్లడించింది.

మసీదులోకి మహిళల ప్రవేశం గురించి పుణేకు చెందిన ముస్లిం మహిళ, న్యాయవాది కూడా అయిన ఫర్హా అన్వర్ హుస్సేన్ షేక్ 2020 లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది.

ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు నుంచి సమాధానం కోరుతూ నోటీసులు ఇచ్చింది. దాంతో బోర్డు రెండు అఫిడవిట్లు దాఖలు చేసింది. మహిళలు కావాలనుకుంటే మసీదుకు వెళ్లి నమాజ్ చేసుకోవచ్చని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తన అఫిడవిట్‌లో పేర్కొన్నది. అయితే, మహిళలు మసీదుల్లో మగవారి మధ్య లేదా మగవారితో కలిసి కూర్చొని నమాజు చేయడం ఇస్లాం అనుమతించదని కోర్టు దృష్టికి తెచ్చింది.

మసీదు కమిటీ ఇందు కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించినట్లయితే మహిళలు అక్కడికెళ్లి నమాజ్ చేసుకోవచ్చునని తెలపింది. మసీదుకు వెళ్లి నమాజ్ చేయడం, చేయకుండా ఉండటం అనేది నిర్ణయించుకోవడం వారి చేతుల్లోనే ఉన్నదని చెప్పింది. ముస్లిం మహిళలు జమాత్‌లో 5 సార్లు ప్రార్థన చేయడం లేదా శుక్రవారం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని, స్త్రీలు ఇంట్లో లేదా మసీదులో నమాజ్‌ చేసినా ఆమెకు అదే సవాబ్‌ లభిస్తుందన్నది. అయితే, పురుషులు తప్పనిసరిగా మసీదులోనే నమాజ్‌ చేయాలనే నిబంధన ఉన్నదని కోర్టుకు తెలిపింది.