2023-24లోనూ ఆర్ధిక వ్యవస్థ పరుగులు పెడుతుంది

దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని, ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశం అభివృద్ధి పథంలో స్థిరంగా ముందుకు పోతోందని  చెబుతూ 2023-24లోనూ ఇదే ఒరవడి కొనసాగుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభలో బడ్జెట్ పై సాధారణ చర్చ సందర్భంగా సమాధానమిస్తూ ఆర్థిక వ్యవస్థకు కొత్త రెక్కలు తొడిగేందుకు మూలధన వ్యయం పెంపు మార్గాన్ని కేంద్రం ఎంచుకుందని వివరించారు.

 చైనాలో కరోనా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా వస్తు ధరలు పెరిగాయని, ఓవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోందని, ఇలాంటి పరిస్థితులు, అంతర్జాతీయ ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నడుమ… సంక్షోభం నుంచి కోలుకుంటూ ప్రవేశపెట్టిన బడ్జెట్ అని నిర్మలా సీతారామన్ వివరించారు. భారత్ లోనే కాకుండా, అనేక దేశాల్లో వాతావరణ వైపరీత్యాల పరిస్థితి ఆహార ద్రవ్యోల్బణానికి దారితీసిందని ఆమె తెలిపారు.

ఇక, నూతన ఆదాయ పన్ను వ్యవస్థలో ఎలాంటి షరతులు లేని రిబేట్ పెంపుదల నిర్ణయం తీసుకున్నామని నిర్మల సభకు వివరించారు. తమ తప్పనిసరి అవసరాలకు అత్యధిక మొత్తంలో ఖర్చు చేసే తక్కువ ఆదాయ వర్గాల వారికి ఇది ఎంతగానో ప్రయోజనకరంగా ఉండే విధానం అని అభివర్ణించారు.

రూ.9 లక్షల వేతనం ఉండే వ్యక్తి అందులో రూ.4.5 లక్షలకు మినహాయింపు కలిగివుండడం, అదే సమయంలో కుటుంబం కోసం ఖర్చు చేసేందుకు తగినంత డబ్బును కలిగివుండడం అనేది ఎల్లప్పుడూ సాధ్యపడకపోవచ్చని ఆమె వివరించారు. మొత్తమ్మీద భారతదేశ ఆర్థిక అవసరాలను సమతుల్యం చేసే బడ్జెట్ ఇదని నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ను నిర్వచించారు.

ఇక, ఆహార సబ్సిడీల్లో కోత విధించారన్న విపక్షాల ఆరోపణల పట్ల కూడా ఆమె స్పందించారు. విపక్షాల వాదనల్లో పస లేదని, తాము ఆహార సబ్సిడీలను రూ.1.97 లక్షల కోట్లతో రెట్టింపు చేశామని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు.

ఎవరినో దృష్టిలో  ఉంచుకొని కేటాయింపుల ఉండవు
 
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం యావత్ దేశాన్ని దృష్టిలో ఉంచుకుని విధానాలను రూపొందిస్తోందని, బీజేపీ జిజాజీలు, భతిజాల పార్టీ కాదని అంటూ నిర్మలా సీతారామన్ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక వ్యక్తిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం బడ్జెట్‌ను రూపొందించిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
“ఎవరినో దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేసినట్లు ప్రకటనలు ఇవ్వడం తప్పు. నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో, మేము నిధుల కేటాయింపులో ఏ ఒక్కరినీ కాకుండా మొత్తం దేశాన్ని దృష్టిలో ఉంచుకోము” అని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై దాడికి దిగిన ఆర్థిక మంత్రి, కొందరు నేతలు ఆ ఆరోపణలను విసిరివేసి వెళ్లిపోయారని ఆమె ఎద్దేవా చేశారు.
 
“కేటాయింపులు జరిగితే, ఫోన్ కాల్స్ చేసినట్లయితే, జిజాజీలు, భతిజాలు ప్రయోజనాలు పొందినట్లయితే సంబంధాలకు ప్రయోజనాలు లభిస్తే; అది వారి (కాంగ్రెస్) సంస్కృతి కావచ్చు. ప్రధాని మోదీ హయాంలో మాలో ఎవరూ అలా చేయడం లేదు,” అని ఆమె తేల్చి చెప్పారు.  అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ విడుదల చేసిన నివేదిక తర్వాత అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో విఫలమైన నేపథ్యంలో కాంగ్రెస్ ఈ  ఆరోపణ చేసింది. ఈ నివేదిక అదానీ గ్రూప్ షేర్ల భారీ పతనానికి కారణమైంది.