భారత్‌‌ తమ ‘దోస్త్’..తుర్కియే ప్రశంసల వర్షం

భారీ భూకంపంతో అతలాకుతలమైన తుర్కియే (టర్కీ)కు అండగా నిలిచిన భారత్‌పై ఆ దేశ రాయబారి ఫిరాత్ సునెల్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌ను ఫ్రెండ్ అని సంబోధించిన ఆయన అవసరంలో అక్కరకు వచ్చిన వారే నిజమైన స్నేహితులని సోమవారం ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.  టర్కీ, హిందీ భాషల్లో ‘దోస్త్’ ఉమ్మడి పదంగా ఉందని చెప్పుకొచ్చారు. అంతకుమునుపు.. భారత విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ తుర్కియే రాయబారితో సమావేశమయ్యారు. అక్కడి ప్రజలకు భారత్‌ తరపున సంఘీభావం తెలిపారు.

భూకంపం సమాచారం అందగానే భారత్ తుర్కియేకు వైద్య సిబ్బంది, సహాయ సామగ్రిని తరలించింది. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు, మెడికల్ టీమ్స్‌ను టర్కీకి పంపించేందుకు నిర్ణయించినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం అంతకుముందు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో తుర్కియే ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది.

మొత్తం రెండు వందల మంది సిబ్బంది ఉన్న 2 జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను తుర్కియే సహాయార్థం పంపించేందుకు నిర్ణయించినట్టు పేర్కొంది. ప్రధాన మంత్రి ముఖ్య సలహాదారు పీ.కే.మిశ్రా ఆధ్వర్యంలో సౌత్‌ బ్లాక్‌లో తుర్కియేకు అందించాల్సిన తక్షణ సాయంపై సమావేశం జరిగింది. తుర్కియే, సిరియా దేశాల్లో సోమవారం సంభవించిన భారీ భూకంపం ఈ శతాబ్దంలోని భారీ భూకంపాల్లో ఒకటిగా రికార్డుల కెక్కింది. శిథిలమైన భవనాలు, ప్రజల ఆర్తనాదాలతో ఆ ప్రాంతాలు మరుభూమిని తలపిస్తున్నాయి.

టర్కీ చేరుకున్న తొలి  ఎన్డీఆర్ఎఫ్ దళం

వరుస భూకంపంతో అతాలకుతలమైన టుర్కియేలో రెస్క్యూ ఆపరేషన్‌ కోసం భారత్‌కు చెందిన తొలి  ఎన్డీఆర్ఎఫ్ దళం మంగళవారం ఉదయం అక్కడికి చేరుకుంది.దళంలో మొత్తం 47 మంది రక్షణ సిబ్బంది, ముగ్గురు సీనియర్‌ అధికారులు ఉన్నారు. వారితోపాటు రక్షణ చర్యల్లో తర్ఫీదు పొందిన డాగ్‌ స్క్వాడ్‌ను కూడా టుర్కియేకు చేరవేశారు.

 అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్‌కు అవసరమైన సామాగ్రిని కూడా వారితో పంపించారు. వాటిలో ఔషధాలు, డ్రిల్లింగ్‌ మెషిన్‌లు, కటింగ్‌ మిషన్‌లు తదితర సామాగ్రి ఉన్నాయి.  యాభై మందితో కూడిన తొలి  ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని భారత వాయుసేకు చెందిన సీ17 విమానం టుర్కియేకు చేరవేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మీడియాకు వెల్లడించారు.

 ఢిల్లీలోని టుర్కియే రాయబార కార్యాలయం కూడా భారత్‌ పంపిన తొలి ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌ భూకంప కల్లోలిత ప్రాంతానికి చేరుకుందని ప్రకటించింది. కాగా, ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి మరో  ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా టుర్కియేకు బయలుదేరింది.

రాజ్యసభ నివాళి

ఇలా ఉండగా, తుర్కియేలో సంభ‌వించిన భూకంపంలో మ‌ర‌ణించిన కుటుంబాల‌కు రాజ్య‌స‌భ నివాళి అర్పించింది. వ‌రుస‌గా మూడు భూకంపాలు రావ‌డం వ‌ల్ల తుర్కియే, సిరియా దేశాల్లో సుమారు నాలుగు వేల‌కుపైగా మంది మ‌ర‌ణించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయ‌ని రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న‌క‌ర్ తెలిపారు.  మంగళవారం స‌మావేశాలు ప్రారంభ‌మైన త‌ర్వాత ఆయ‌న మాట్లాడుతూ.. ఫిబ్ర‌వ‌రి ఆరో తేదీన 7.8 తీవ్ర‌త‌తో తుర్కియేలో భూకంపం వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా వంద‌ల సంఖ్య‌లో ప్ర‌కంప‌న‌లు న‌మోదు అయిన‌ట్లు వెల్ల‌డించారు. రెండు దేశాల్లోనూ ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగిన‌ట్లు చెప్పారు.

తుర్కియే, సిరియా దేశాల‌కు భారత్ త‌న వంతు స‌హాయాన్ని అందిస్తోంద‌ని జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాలు, రెస్క్యూ టీమ్ అక్క‌డ‌కు వెళ్లింద‌ని, ప్ర‌త్యేక శిక్ష‌ణ పొందిన శున‌కాలు, వైద్య ప‌రిక‌రాలు, ఇత‌రు ఇక్విప్మెంట్ కూడా అక్క‌డ‌కు వెళ్లిన‌ట్లు ఆయ‌న చెప్పారు. తుర్కియే, సిరియా ప్ర‌జ‌ల‌కు సంఘీభావం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తుర్కియే వెళ్లిన విష‌యాన్ని విదేశాంగ శాఖ ప్ర‌తినిధి ఆరింద‌మ్ బ‌గ్చి కూడా త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.