రాఫెల్ విమర్శలపై హెచ్‌ఏఎల్ తో బయటపడిన నిజం

రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌కు ప్రయోజనం చేకూరుస్తోందని, ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ దిగ్గజం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)ను నాశనం చేస్తోందని ప్రతిపక్షాలు గతంలో గుప్పించిన ఆరోపణలకు ఇప్పుడు నిజం బైటపడిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు.
 
కర్ణాటకలోని తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) గ్రీన్ ఫీల్డ్ హెలికాప్టర్ తయారీ కర్మాగారాన్ని ప్రధాని మోదీ సోమవారం ప్రారంభిస్తూ గతంలో ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై విరుచుకుపడ్డారు.  హెచ్‌ఏఎల్  గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేశారని,తమ ప్రభుత్వంపై చాలా తప్పుడు ఆరోపణలు చేశారని,పార్లమెంటు అనేక పని గంటలను దాని కోసం వృధా చేశారని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
 
“తుముకూరులోని  హెచ్‌ఏఎల్ హెలికాప్టర్ ఫ్యాక్టరీ, దాని పెరుగుతున్న శక్తి తప్పుడు ఆరోపణలు చేసిన వారి తప్పుడు ఆరోపణలను బట్టబయలు చేస్తుంది.  హెచ్‌ఏఎల్ రక్షణలో స్వావలంబనను పెంచుతోంది. ప్రతిపక్షాల ఆరోపణలకు తుముకూరులోని ఈ ఫ్యాక్టరీ ఓ సమాధానం.. ఈరోజు నిజం బయటపడుతోంది”అని మోదీ స్పష్టం చేశారు.
 
ఫ్రెంచ్ సంస్థ నుండి రాఫెల్ విమానాల కొనుగోలుకు రూ.59,000 కోట్ల ఒప్పందంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించింది. చౌకీదార్ చోర్ హై (కాపలాదారు ఒక దొంగ) ప్రచారంతో ప్రధానమంత్రిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. రాఫెల్ ఒప్పందం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌కు ప్రయోజనం చేకూర్చిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
 
కాంగ్రెస్ హయాంలో ఖరారు చేసినట్లుగా ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ దిగ్గజం హెచ్‌ఎఎల్ ఎందుకు ఇందులో ప్రమేయం లేదని ప్రశ్నించింది. ప్రధాని మోదీ ప్రభుత్వం హెచ్‌ఏఎల్‌ను నాశనం చేస్తోందని, హెచ్‌ఏఎల్‌ నుంచి కాంట్రాక్టును లాగేసుకొని కర్ణాటక ప్రజల నుంచి ఉద్యోగాలను లాక్కుంటోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ గతంలో ఆరోపించారు.  అయితే రాఫెల్ డీల్ లో అవకతవకలు జరిగాయంటూ నవంబర్ 2020లో కాంగ్రెస్ వేసిన పిటిషన్‌ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాఫెల్‌ డీల్‌పై ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.
 
 కాగా, ప్రధాని ఇప్పుడు ప్రారంభించిన కర్మాగారం భారతదేశపు అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రంగా ఉంది. ప్రారంభంలో లైట్-యుటిలిటీ హెలికాప్టర్లను (ఎల్ యు హెచ్ లను) ఉత్పత్తి చేస్తుంది. ఎల్ యు హెచ్ అనేది దేశీయంగా రూపొందించబడిన, అభివృద్ధి చేయబడిన 3-టన్నుల తరగతి, ఒకే-ఇంజిన్ మల్టీపర్పస్ యుటిలిటీ హెలికాప్టర్, ఇది అధిక యుక్తులతో కూడిన ప్రత్యేక లక్షణాలతో ఉంటుంది.
 
ప్రారంభ దశలో కర్మాగారం సంవత్సరానికి సుమారు 30 హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది. తరువాత దాని సామర్థ్యాన్ని పెంచుకొంటూ దశలవారీగా సంవత్సరానికి 60 నుండి 90 హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది. గ్రీన్‌ఫీల్డ్ హెలికాప్టర్ ఫ్యాక్టరీ 615 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దేశంలోని అన్ని హెలికాప్టర్ అవసరాలకు ఒక-స్టాప్ సొల్యూషన్‌గా మారాలనే లక్ష్యంతో ప్రణాళిక చేయబడింది.
ఇది భవిష్యత్తులో ఎల్ సి హెచ్, ఎల్ యు హెచ్, సివిల్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఎ ఎల్ హెచ్), ఐ ఎం ఆర్ హెచ్ నిర్వహణ, మరమ్మత్, మరమ్మత్తు కోసం కూడా ఉపయోగించబడుతుంది. హెచ్‌ఏఎల్ 3-15 టన్నుల శ్రేణిలో 1,000 హెలికాప్టర్‌లను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. 20 సంవత్సరాల కాలంలో మొత్తం రూ. 4 లక్షల కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకుంది.