
ఐటీఐఆర్ ఇవ్వడం లేదంటూ కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం విమర్శలు చేయడం సరికాదంటూ దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తన వంతుగా చేయాల్సిన పనులను చేయకుండా పదే పదే కేంద్రంపై ఆరోపణలు, విమర్శలు చేయడం పద్ధతి కాదని ధ్వజమెత్తారు. ఐటీఐఆర్ పై బహిరంగచర్చకు రావాలంటూ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కు ఆయన సవాల్ విసిరారు. ఐటీఐఆర్‌పై బీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐటీఐఆర్ పై కేసీఆర్ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని విమర్శించారు.
ఐటీఐఆర్ ను 2 విడతలుగా చేయాలని నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఐటీఐఆర్ కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు మొదటి ఫేజ్ కోసం కేంద్ర ప్రభుత్వం 2015లోనే రూ.85 కోట్లు విడుదల చేసిందని రఘునందన్ రావు గుర్తు చేశారు.
కాగా, ఇమ్లిబన్ బస్టాండ్ నుంచి ఫలక్ నామా వరకూ మెట్రో ఎందుకు రాలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మెట్రో రాకపోవడానికి బీఆర్ఎస్ తో పాటు ఎంఐఎం కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎంఐఎంకు పాతబస్తీ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఆరోపోయించారు. ఫలక్ నామా నుంచి శంషాబాద్ వరకూ కొత్త రైల్వేలైన్ (మెట్రో) ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెప్పారు. కొత్త రైల్వేలైన్ కోసం డీపీఆర్ పూర్తి చేయకుండా, స్థలం సేకరించకుండానే కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐటీఐఆర్ అంటే భవనాలు కాదు.. పెట్టుబడులు ఆకర్షించటానికి రోడ్లు, మెట్రో రైలును అభివృద్ధి చేయటమని తెలుస్తుకోవాలని హితవు చెప్పారు. ఐటీఐఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ఒక్క పనికూడా చేయడంలేదని ఎమ్మెల్యే రఘునందనరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపడం లేదని స్పష్టం చేశారు. కేవలం కేంద్రానికి ఉత్తరాలు రాస్తే కంపెనీలు రావని, డీపీఆర్ లు ఇస్తే పనులు ముందుకు సాగుతాయని ఎద్దేవా చేశారు. కేంద్రం, ప్రధాని మోదీపై క్రమపద్దతిలో బీఆర్ఎస్ దాడి చేస్తోందని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు.
ఐటీఐఆర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. ఐటీఐఆర్ కు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ నిధులను కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. డీపీఆర్ సమర్పించుకుంటే కేంద్రం నిధులు ఎలా కేటాయిస్తోందని ప్రశ్నించారు. తెలంగాణలో హైవేలు, రైల్వేల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
More Stories
హనుమాన్ జయంతి యాత్రకు సిపి ఆనంద్ భరోసా
ప్రభుత్వ భూముల్లో విల్లాలు.. కేటీఆర్ వందల కోట్ల కుంభకోణం
సద్గురు జగ్గీ వాసుదేవ్ కి వాటర్ ఛాంపియన్ అవార్డు