పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ కన్నుమూత

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (79) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయ్‌లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు పాకిస్థాన్‌ మీడియా వెల్లడించింది.  ముషారఫ్.. 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించారు. దుబాయ్‌లోని అమెరికన్ ఆసుపత్రిలో అమిలోయిడోసిస్ వ్యాధికి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పాకిస్థాన్ మీడియా వెల్లడించింది.  
1947లో దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం పాకిస్థాన్‌కు వెళ్లిపోయింది. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. లాహోర్‌లోని ఫోర్మాన్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు.  1964లో పాకిస్థాన్ సైన్యంలో చేరారు. క్వెట్టాలోని ఆర్మీ స్టాఫ్ అండ్ కమాండ్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయ్యారు.
అనంతరం అంచలంచలుగా ఎదిగి పాక్‌ సైనికదళాల ప్రధానాధికారి పదవిని చేపట్టారు.  1999లో అప్పటి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సర్కార్‌పై తిరుబాటు చేసి సైనిక పాలకుడి పగ్గాలు చేజిక్కించుకున్నారు.  రెండేండ్ల తర్వాత పాక్‌ 10వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2001 నుంచి 2008 వరకు దేశాధ్యక్షుడిగా పనిచేశారు. అయితే అభిశంసను తప్పించుకునేందుకు తన పదవికి రాజీనామా చేశారు.
కాగా, 2014 మార్చి 31న దేశద్రోహం కేసులో ఆయనను ఇస్లాబాద్‌లోని ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. దేశద్రోహం నేరం కింద మరణశిక్ష విధించింది.  దీంతో అరెస్టు చేస్తారనే భయంతో ఆయన దుబాయ్‌ పారిపోయారు. మార్చి 2016 నుంచి దుబాయ్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు. 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధానికి ఆయనే ప్రధాన కారకుడు.

దేశ విభజనకు ముందు ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో 1943లో జన్మించిన ముషారఫ్‌కు ఆరు దశాబ్దాల తరువాత 2005లో ఢిల్లీలోనే భారత ప్రభుత్వం జనన ధృవీకరణ పత్రం అందించింది. అప్పట్లో ఆయన భారత పర్యటనకు వచ్చారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ముషారఫ్‌కు ఈ పత్రాన్ని అపురూప కానుకగా అందించారు.

ఆయన ఢిల్లీలో పుట్టారు. పాకిస్థాన్‌లో ఏలారు. ఇప్పుడు దుబాయ్‌లో మరణించారని అప్పట్లో ఆయనకు బర్త్ సర్టిఫికెట్ జారీ క్రమంలో బాధ్యతలు నిర్వర్తించిన ఓ మాజీ అధికారి తెలిపారు. కార్గిల్ దుస్సాహసం తరువాత భారత పర్యటనకు వచ్చిన ముషారఫ్ అజ్మీర్ షరీఫ్ దర్గాకు వెళ్లారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఢిల్లీలో తాను పుట్టి పెరిగిన ప్రాంతాలల్లో తల్లితో కలిసి తిరిగి వెళ్లారు.

కాంగ్రెస్ పై బిజెపి ఆగ్రహం

ఇలా ఉండగా,  జనరల్ పర్వేజ్ ముషారఫ్ ను ప్రశంసల్లో ముంచెత్తిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముషారఫ్‌ కార్గిల్ యుద్ధానికి కారకుడయ్యారని, అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను కొనియాడారని గుర్తు చేసింది. ముషారఫ్ (79) సంగతి తెలిసిందే. ముషారఫ్ మృతిపై శశి థరూర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ, ముషారఫ్ అరుదైన ఒకప్పుడు భారత దేశానికి రాజీలేని శత్రువు అని, అయితే 2002-2007 మధ్య కాలంలో నిజమైన శాంతికాముకుడిగా మారారని కొనియాడారు.

ఆ రోజుల్లో తాను ఐక్య రాజ్య సమితిలో ఆయనను ప్రతి సంవత్సరం కలిసేవాడినని చెప్పారు. ఆయన చాలా తెలివైనవారని, కలుపుగోలుగా ఉంటారని, వ్యూహాత్మక ఆలోచనలో చాలా స్పష్టంగా ఉంటారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

దీనిపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ట్విటర్ వేదికగా స్పందిస్తూ, ఈ కాంగ్రెస్ పార్టీ బాలాకోట్ దాడుల విషయంలో భారత సైన్యాన్ని అనుమానించిందని, ఒసామా బిన్ లాడెన్‌ను పొగిడిందని, భారత సైన్యాధిపతిని రోడ్డు మీద గూండా అని వ్యాఖ్యానించిందని, ఇప్పుడు ముషారఫ్‌ను ప్రశంసిస్తోందని దుయ్యబట్టారు. ముషారఫ్ గతంలో రాహుల్ గాంధీని జెంటిల్మన్ అని పొగిడారని గుర్తు చేశారు.